సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- వనపర్తి
కేరళ సీఎం విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓటు వేయడం మోడీకి ఓటు వేయడంతో సమానమని, అది మోడీ సోదరుల విజయమవుతుందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఘాటుగా ఖండించారు. తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఒకప్పుడు ప్రధాని మోడీని పెద్దన్నగా ప్రశంసించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు విజయన్, మోడీలను సోదరులని మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని, కేరళలో యూడీఎఫ్ గెలవాలని చెప్పడాన్ని విమర్శించారు.
కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం విద్యా రంగానికి 24 శాతం నిధులు కేటాయిస్తుండగా, తెలంగాణ 8 శాతం కూడా కేటాయించడం లేదని, అలాంటిది అక్కడికిపోయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేరళలో ప్రజలకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందిస్తుండగా, తెలంగాణలో వైద్యం వ్యాపారమ యమైందని, పేదల ప్రాణం పోయినా పట్టించుకోని పరిస్థితి ఉందని విమర్శించారు. వాగ్దానం చేసిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేయలేని, మహిళలకు రూ.2500 ఇవ్వలేదని, వ్యవసాయ కూలీలకు రూ.12,000, కౌలు రైతులకు రూ.15,000 ఇవ్వలేదని, పేదల కోసం ఇంకా ఇండ్లు కట్టలేదని.. ఇవన్నీ అమలు చేయనప్పుడు తెలంగాణ దేశంలోనే ఎలా ప్రథమ స్థానంలో నిలిచిందని జాన్‌వెస్లీ ప్రశ్నించారు. సంపూర్ణ పేదరికం లేని రాష్ట్రంగా కేరళను తీర్చిదిద్దడం ఎల్డీఎఫ్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోగానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలోగానీ అసలు పేదవాళ్లే లేరని వాళ్లు ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు.
ప్రతిఒక్కరూ అక్షరాస్యులు కావడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ కాదనలేరని అన్నారు. కేరళ ప్రజలు వివేకవంతులని, ప్రతి ఒక్కరూ ఆలోచించి యూడీఎఫ్ కూటమికి తగిన గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరిం చారు. మత సామరస్యాన్ని పరిరక్షించడంలో, సామాజిక న్యాయాన్ని కాపాడటంలో, సంక్షేమం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని వివరించారు. ఆ రాష్ట్ర ప్రజలు ఎల్డీఎఫ్కు మరోసారి మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.జబ్బార్, డి.బాల్ రెడ్డి, ఎ.లక్ష్మి, మండ్ల రాజు, నాయకులు మేకల ఆంజనేయులు, బాల్యానాయక్, మండ్ల కృష్ణయ్య, ఆర్ఎన్.రమేష్, వెంకటేష్ ఉన్నారు.



