కొరవడిన రాజకీయ నిజాయితీ, చిత్తశుద్ధికి నిదర్శనం
విజయన్‌పై వ్యక్తిత్వ హననం, దూషణలకు దిగటం సరిగాదు
28 నెలల పాలనలో నువ్వేం చేశావు? ..హామీల మాటేమైంది?
తెలంగాణ సర్కారు డబ్బుతో కేరళ పత్రికల్లో కాంగ్రెస్‌కు ప్రచారమేంటి?
అభివృద్ధిలో, మానవాభివృద్ధి సూచీల్లో కేరళంతో ఏ రాష్ట్రమూ పోటీ పడలేదు
1968లోనే కేరళంలో నంబూద్రిపాద్ పాలనలో కులగణన
అక్కడ ఎల్‌డీఎఫ్ మళ్లీ గెలవటం లౌకిక శక్తులకు అత్యావశ్యకం
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ లౌకిక శక్తుల బలోపేతానికి కృషి
బీజేపీకి లబ్ది చేకూర్చేలా కాంగ్రెస్ విధానాలు : నవతెలంగాణతో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేరళం సీఎం పినరయి విజయన్‌కు రాసిన ఆరు పేజీల బహిరంగ లేఖ మొత్తం అసత్యాలు, వక్రీకరణలతో ఉందని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. అది ఫక్తు ఎన్నికల స్టంట్ అంటూ ఆయన కొట్టి పడేశారు. అందులో రాజకీయ నిజాయితీగానీ, సత్యసంధత గానీ లేదని దుయ్యబట్టారు. కేరళంలో ఎల్డీఎఫ్ పాలన అభివృద్ధి లోనూ, మానవాభి వృద్ధి సూచికల్లో సాధించిన ప్రగతిని దిగమింగుకోలేక, అంగీకరించడం తప్ప మరో గత్యంతరం లేక ఆ ప్రగతి అంతా 70 ఏండ్ల ఉమ్మడి కృషి అని, అచ్చంగా వామపక్షాల గొప్పతనం కాదని చూపించడానికి రేవంత్‌రెడ్డి తన లేఖలో నానా తంటాలు పడ్డారని ఎద్దేవా చేశారు. తాజా రాజకీయ పరిణామాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, మన విదేశాంగ విధానం తదితరాంశాలపై రాఘవులు… నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు…
ములాఖాత్
కేరళం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… ఎల్డీఎఫ్ ప్రభుత్వంపైనా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు..తెలంగాణ, కేరళంలోని ప్రగతి గురించి ఆయన ప్రస్తావించారు. దీనిపై మీరేమంటారు…?
‘తెలంగాణ వెనుకబాటు తనం గురించి పినరయి విజయన్ ప్రస్తావించారు. అయితే దానిలో తన బాధ్యతేం లేదనీ, తాను 28 నెలల పాలనకే బాధ్యుడునని రేవంత్ రెడ్డి బుకాయించే ప్రయత్నం చేశారు. తాను ఏ కాంగ్రెస్ పార్టీకి నాయకుడుగా ఉన్నాడో ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ముఖ్యమంత్రులు 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ప్రస్తుత తెలంగాణను పరిపాలించారు. కేవలం నలుగురు మాత్రమే ఇతర పార్టీలకు చెందిన వారు. తెలంగాణ రాష్ట్ర వెనుకబాటు తనానికి సుధీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ బాధ్యత వహించదా? ఆ పార్టీ దుష్పరిపాలనకు కాంగ్రెస్ నాయకుడైన రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకోరా? ప్రగతి అయితేనేమో తమ గొప్పతనం, తిరోగతికేమో ఇతరులది బాధ్యత అని చెప్పడం చౌకబారుతనమే అవుతుంది. రేవంత్‌రెడ్డి అన్ని పార్టీల తప్పులకూ బాధ్యత వహించాల్సిన వ్యక్తి. కాంగ్రెస్ అధినేతగా ఇప్పుడున్నారు. గతంలో టీడీపీలోముఖ్య నాయకుడిగా ఉన్నారు. విద్యార్థి దశలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పరివారానికి చెందిన ఏబీవీపీలో పనిచేశారు. సమిష్టి బాధ్యత మీద ఆయనకే చిత్తశుద్ధి ఉంటే 28 నెలల పాలనకు కాదు…ఏడు దశాబ్దాల్లో ఉమ్మడి రాష్ట్రాన్ని, తెలంగాణను అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం, పరోక్షంగా హాని చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసమర్థ పాలనలకు బాధ్యత వహించాలి…’
కేరళం కంటే తెలంగాణే అన్ని రంగాల్లో ముందుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు కదా?
‘నిజమేమిటంటే ఏడు దశాబ్దాల కేరళ రాష్ట్ర ప్రస్థానంలో కాంగ్రెస్ కన్నా తక్కువ కాలం వామపక్షాలు పరిపాలన సాగించాయి. అయితే ఆ రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు పోవడానికి వామపక్ష ప్రభుత్వాలు అనుసరించిన ప్రగతిశీల విధానాలే కారణం. కేరళంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాల హయాంలో సమగ్రమైన భూసంస్కరణలు అమలు జరిపారు. ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. స్థానిక సంస్థలకు నిధులను, అధికారాలను బదలాయించడంలో, అధికార వికేంద్రీకరణ చేయడంలో ఏ రాష్ట్రం కూడా కేరళంతో పోటీపడలేదు. కార్మికులు, రైతులు, వృత్తిదారులు, దళితులు, మహిళలు, ఇతర సామాజిక తరగతుల వారి హక్కులను కాపాడటంలో వామపక్ష ప్రభుత్వాలు అగ్రశ్రేణిలో ఉన్నాయి. అందుకే కేరళ అత్యధిక అభివృద్ధి సూచికల్లో ముందున్నది. భౌగోళికంగా, వనరుల రీత్యా కేంద్ర ప్రభుత్వాల వివక్ష రీత్యా, విధానాల రీత్యా అనేక ఆటంకాలు ఎదురైనా, పరిమితులు ఉన్నా ఈ ప్రగతిని సాధించడం వామపక్ష ప్రభుత్వాలతోనే సాధ్యమైంది. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి ఆస్కారం లేకుండా సమర్థవంతంగా ప్రణాళికలను అమలు జరిపి అభివృద్ధికి తోడ్పడ్డాయి. ప్రతిపక్షంలో ఉంటే అప్పటికే సాధించిన విజయాలు కాంగ్రెస్ వమ్ము చేయకుండా పోరాటాలు నిర్వహించి సాధించిన విజయాలను రక్షించుకున్నాయి. అందుకే ప్రగతి నిరంతరాయంగా సాగింది. గత పదేండ్లలో వరుసగా వామపక్షాలు రెండు సార్లు ప్రభుత్వాన్ని నడపడం ద్వారా ఆ ప్రగతిని మరింత వేగవంతం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం పాత చరిత్రకు తనకు సంబంధం లేదని అనడమంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పుకోవటానికి నిరాకరిస్తున్నాడని అనుకోవాలి. లేఖలో రాజకీయ పాలనను మాత్రమే విమర్శించానని చెబుతూనే వ్యక్తిత్వ హననానికి, దూషణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్పడ్డారు. ఆయన ప్రస్తావించిన 28 నెలల పరిపాలన చూసినా సాధించిందేమీ కనిపించడం లేదు. లేఖలో ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఏకరువు పెట్టారు. ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాలు చేశారు. వాటన్నింటినీ చాలా వరకు అమలు చేశామని ఘనంగా పేర్కొన్నారు. ఈ వాగ్దానాల అమలు గురించి చెప్పినవి మాటల మూటలు తప్ప చేతల్లో కానరావడం లేదు.
హామీల్లో చాలా అమలు చేశాం.. రానున్న రెండున్నరేండ్లలో అన్నీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు కదా?
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మచ్చుకు కొన్ని అంశాలను పరిశీలిస్తే… వాగ్దానాలు ఎంత బూటకంగా ఉన్నాయో అర్థమవుతుంది. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. రెండున్నరేండ్లలో నోటిఫికేషన్లు ఇచ్చింది 16,978 మాత్రమే. మహాలక్ష్మి గ్యారెంటీ అమలు కాలేదు. డ్వాక్రా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం..పెండ్లిళ్లకు తులం బంగారం, కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ మాటే మరిచిపోయింది. నిరుద్యోగ యువతకు రూ.4 వేల హామీ ఊసే లేదు. వయోవృద్ధులు రూ.4 వేల పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రకంగా చూస్తే… ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిన ప్రధాన వాగ్దానాలేవీ అమలు కాలేదు. కొన్నింటిని అరకొరగా ప్రారంభించారు. చేసిన వాగ్దానాల పరిస్థితి ఇదైతే ఇక్కడేదో ఉద్ధరించామన్నట్టుగా కేరళంలో మలయాళ పత్రికల్లో వ్యాపార ప్రకటనలు ఇస్తూ అక్కడ ప్రజల్ని మోసగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వ ఖర్చుతో కేరళంలో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ద్రుష్పచారానికి దిగారు. పక్కరాష్ట్రానికి వెళ్లి అక్కడి వ్యక్తుల మీద తప్పుడు ప్రచారానికి దిగడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం…’
కొన్ని కేసుల గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కదా?
‘ప్రచార సమయంలో తన వ్యాఖ్యలను సమర్థించుకు నేందుకు రేవంత్ రెడ్డి నానా తంటాలు పడ్డారు. కేరళం కాంగ్రెస్ నాయకులు చెప్పిన అబద్దాలను చిలుకపలుకలు పలకడం తప్ప అందులో ఏమీ లేదు. తమోడీ సర్కారు కేంద్ర సంస్థలను వినియోగించి ప్రతిపక్షాలను దెబ్బతీయటాన్ని ఇండియా బ్లాక్‌లోని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. కేరళం ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను వమ్ము చేసేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరం కుయుక్తులు పన్నుతోంది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు చట్టబద్ధంగానే నిధులు సేకరిస్తే ఆనాటి ఆర్థిక శాఖమంత్రి థామస్ ఐజాక్ మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. ఈ వాస్తవాలను మరిచిన రేవంత్ రెడ్డి… మోడీతో విజయన్ రాజీపడుతున్నారని ప్రచారం చేయడం దుర్మార్గం. ఆయన తన లేఖలో కూడా ఇలాగే ద్రుష్పచారం చేశారు. రేవంత్ రెడ్డి వరుసగా ఢిల్లీకి వెళ్లి మోడీని ఏదోరకంగా ప్రసన్నం చేసుకుంటున్నారు. పలుమార్లు ఆయన్ను పెద్దన్న అంటూ సంబోధించారు కూడా. కానీ పినరయి విజయన్… ఆర్‌ఎస్‌ఎస్, సంఘపరివార్ శక్తులకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నారు. ఆయన మతోన్మాద శక్తులతో రాజీపడే వ్యక్తి కాదు.
తన లేఖలో దేశంలోనే మొట్టమొదటి సారిగా సామాజిక కులగణన చేసిన రాష్ట్రంగా తెలంగాణ అని రేవంత్ పేర్కొనటం సరిగాదు. దేశంలో మొట్టమొదటిసారి 1968లో ఈఎమ్‌ఎస్ నంబూద్రిపాద్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కులగణనను చేసి చూపెట్టింది. దాని ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలును మెరుగుపర్చింది. ఇలాంటి వాస్తవాలను విస్మరించి గొప్పతనాన్ని తన ఒక్కరికే ఆపాదించుకోవడం రేవంత్‌రెడ్డికి సముచితం కాదు…’
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బలపడే అవకాశం ఉందా? కేరళంలో ఎల్‌డీఎఫ్ మరోమారు అధికారంలోకి రాబోతుందా?
‘ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వామపక్షాల ముఖ్య రాజకీయ లక్ష్యం బీజేపీ, మతోన్మాద శక్తులు బలపడకుండా నిరోధించడమే. ఈ కృషిని వామపక్షాలు శాయశక్తులా కొనసాగిస్తున్నాయి. కేరళంలో ఎల్‌డీఎఫ్ మూడోసారి గెలవడం ఆ రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలోని లౌకిక శక్తులు బలపడటానికి కూడా అవసరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా లౌకిక శక్తులను సమీకరించడంలో, ఐక్యం చేయడంలో భిన్నాభిప్రాయాలను సర్దుబాటు చేసి ఒక వేదిక మీద నిలబెట్టడంలో వామపక్షాలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. అందువల్ల కేరళంలో కాంగ్రెస్ కూటమి కన్నా వామపక్ష కూటమి గెలవడానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కాంగ్రెస్‌కు ఈ రాజకీయ దృష్టి లేదు. దేశానికి ఎదురవుతున్న మతోన్మాద ప్రమాదాన్ని కూడా పరిగణించకుండా ఆ పార్టీ బీజేపీకి ఉపయోగపడేలా తన తప్పుడు ప్రచారాన్ని ప్రధానంగా సీపీఐ(ఎం) మీద ఎక్కుపెట్టింది. అయినా, వామపక్షాలు విజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది. ఇది దేశంలో లౌకక శక్తులు బలపడటానికి తోడ్పడుతున్నదనే విశ్వాసం మాకుంది. తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పడిన లౌకిక కూటమి అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంది. అక్కడ కూడా వామపక్షాలు ఐక్యత సాధించడంలో కీలక పాత్ర నిర్వహించాయి. గతం కన్నా ఈసారి కొత్త పార్టీలను చేర్చుకోవడం ద్వారా కూటమి విస్తృతమైంది. పార్టీలు పెరిగినందున సీట్ల పంపిణీలో అందరికీ సర్దుబాటు చేయడం కోసం సీపీఐ(ఎం), సీపీఐ తమ సీట్లను తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడ్డాయి. గరిష్ట స్థాయి ఐక్యత కూటమి విజయానికి తోడ్పడుతుంది. లౌకిక శక్తులను బలపరుస్తుంది. బెంగాల్‌లో అనేక కుయుక్తులు, ప్రమాదకర ఎత్తుగడల ద్వారా మత వైషమ్యాలను పెంచిపోషించి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అక్కడ కూడా బీజేపీ, దాని మిత్రులను ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా వామపక్షాలు కృషి చేస్తున్నాయి. టీఎంసీ దృష్టపాలనను ప్రశ్నించే శక్తులుండాలంటే శాసనసభలో వామపక్షాల ప్రాతినిధ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈసారి ఈ లక్ష్యాన్ని సాధించడంలో కాంగ్రెస్ పార్టీ లౌకిక శక్తులను బలహీనపర్చే పద్ధతిలోనే బెంగాల్‌లో సర్దుబాట్లకు సిద్ధం కాకుండా అన్ని సీట్లకూ పోటీపెట్టింది. ఇది అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చే ప్రమాదం పొంచి ఉంది. అస్సాంలోనూ బీజేపీ ప్రమాదకర పాలనను ఓడించేందుకు సీపీఐ(ఎం) లౌకిక శక్తుల భాగస్వామిగా కృషి చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, అక్కడ ప్రధానమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ లౌకిక శక్తులను ముందుకు తీసుకెళ్లడంలో చాలినంత కృషి చేయడం లేదని అనిపిస్తోంది…’
క్రైస్తవంలో చేరిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవనే సుప్రీం కోర్టు తీర్పును ఏవిధంగా చూస్తున్నారు?
‘క్రైస్తవంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించబోవని సుప్రీం కోర్టు తీర్పు చెప్పటం కొత్తేం కాదు. రాజ్యాంగంలో సిక్కు, బౌద్ధ, హిందూ మతాల్లో ఉండే దళితులకు రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉంది. మొదట ఇది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం కల్పించారు. క్రైస్తవం, ముస్లిం మతాల్లో దళితులుగా పరిగణించే వాళ్లకూ రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఐ(ఎం)తో సహా అనేక పార్టీలు, సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌గానీ, ఇప్పుడు బీజేపీగానీ దీన్ని పట్టించుకోలేదు. సమాజంలో వారు ఎదుర్కొంటున్న అస్పృశ్యత ఆధారంగా దళితులకు రిజర్వేషన్లు కల్పించారు. ఏ మతంలో ఉన్నా వివక్ష ఎదుర్కొంటున్నప్పుడు మతం ఆధారంగా రిజర్వేషన్లు తోసిపుచ్చడం సరిగాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. క్రైస్తవంలోని దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు తిరస్కరించకుండా ఉండాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. కొన్ని మతాల్లోని దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తూ, మరికొన్ని మతాల్లోని దళితులకు రిజర్వేషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించడం సరిగాదు. అన్ని మతాల్లోని దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సలహా ఇస్తే బాగుండేది…’
తెలంగాణలో లెఫ్ట్ పోరాటాలు బీజేపీ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయనే ప్రచారంపై మీరేమంటారు?
‘కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూనే బీజేపీ బూచీని చూపెట్టి ప్రజల కోసం వామపక్షాలు పోరాటాలు చేయొద్దని చెప్పడం విడ్డూరంగా ఉంది. బీజేపీ ఎదిగేందుకు అవకాశం లేకుండా పాలన అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కారుదే. మతోన్మాద శక్తులు బలపడకుండా ఉండాలంటే ఆ పార్టీ, ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యల్ని అనుసరించకూడదు. మేం ప్రజావ్యతిరేక చర్యల్ని అనుసరిస్తాం..బీజేపీ ఎదగడానికి తోడ్పడుతాం…మీరు మాత్రం ఉద్యమాలు చేసి ప్రజలకు అండగా ఉండొద్దు… అంటే రాజకీయాల్ని బీజేపీకి వదిలేయాలని సలహా ఇవ్వడం తప్ప మరోటి కాదు. కాంగ్రెస్ రాజకీయ విధానాలే బీజేపీ బలోపేతానికి కారణం అవుతున్నాయి. బీజేపీకి మేం అవకాశం ఇవ్వం. ప్రజలకు హాని చేసే చర్యలు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోం. బీజేపీ, మతోన్మాదం మీద నికరంగా పోరాడుతున్నది సీపీఐ(ఎం), వామపక్ష పార్టీలే. ప్రజావ్యతిరేక విధానాలపై స్పందించకుండా, పోరాడకుండా ఉండే ప్రసక్తే లేదు…’
కవిత కొత్త పార్టీపై మీ స్పందనేంటి?
‘ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది. కవితకూ ఆ స్వేచ్ఛ ఉంది. అయితే, ఆమె పార్టీ విధానాలు బయటకు రావాలి. ఆ తర్వాత ఆ పార్టీ పట్ల మా వైఖరేంటో ప్రకటిస్తాం. బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పుటుకొస్తున్న పార్టీలు దేశంలోని ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడానికి, ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోవడానికి కారణం అవుతున్నాయి. అనేక చోట్ల బీజేపీ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. నచ్చనివాళ్ల మీద నిఘా వ్యవస్థలతో బెదిరిస్తోంది. బీజేపీ కుతంత్రాల పట్ల అన్ని పార్టీలు, ముఖ్యంగా కొత్త పార్టీలు జాగ్రత్తగా ఉండాలి…’



