సీఎం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం
ఆ సంస్థకు కేటాయించిన భూములపై కన్నేసిన ముఖ్యమంత్రి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి కక్షకట్టి మెట్రో నుంచి ఎల్ అండ్ టీని బయటికి పంపించడంతో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బీఆర్‌ఎస్ ను అప్రతిష్టపాలు చేసేందుకు ఎల్ అండ్ టీ సహకరించకపోవడంతో ఆ సంస్థపై ముఖ్యమంత్రి పగబట్టారని ఆయన ఆరోపించారు. ఆ సంస్థకు ఒఆర్‌ఆర్ చుట్టుపక్కలా కేటాయించిన 280 ఎకరాల భూమిపై సీఎం, ఆయన అనుచరుల కన్నుబడిందని దుయ్యబట్టారు. అందుకే ఎల్ అండ్ టీ సంస్థను వేధించి నిష్క్రమించేలా చేశారన్నారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దుతో మొదలుపెట్టి ఆ సంస్థను నానా రకాలుగా వేధించారని తెలిపారు. మేడిగడ్డ విషయంలో తామే మరమ్మతులు చేస్తామని ఎల్ అండ్ టీ ముందుకురావడం రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ”2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20-25 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కేవలం మూడేండ్లలోనే 2017 నవంబర్ 29న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించాం.
కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉందని భయపడితే, కేసీఆర్ మరోసారి అండగా నిలిచి, రూ.3,000 కోట్ల వడ్డీలేని రుణం (సాఫ్ట్ లోన్) మంజూరు చేసి, అందులో రూ.900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారు. మా ప్రభుత్వ హయాంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి, పీక్ అవర్స్‌లో కోచ్‌లు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశాం. 69 కిలోమీటర్ల లైన్ పూర్తి చేసి, దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం. కాంగ్రెస్ హయాంలో ఆవాస హౌటల్ వరకే ఉన్న లైన్‌ను, లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్ స్పేస్ వరకు పొడిగించి, స్కైవాక్‌లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాం”.. అని కేటీఆర్ తెలిపారు.”మేము అధికారం నుంచి దిగిపోయే ముందు, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించాం. ఓఆర్‌ఆర్ చుట్టూ 160 కిలోమీటర్లు, భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ వరకు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపాం. అత్యంత కీలకమైన మైండ్ స్పేస్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తి చేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాం.
భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే నిర్మించేలా దీన్ని డిజైన్ చేశాం. కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయం ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు. నా భూములు ఉన్నాయనీ, బీఆర్‌ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని పిచ్చి పిచ్చి ఆరోపణలతో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్ అండ్ టీపై మొదటి దెబ్బ వేశారు. అప్పటి నుంచే సీఎంకు, ఎల్ అండ్ టీకి మధ్య పంచాయితీ మొదలైంది”… అని కేటీఆర్ అన్నారు. ”మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండా సొంత ఖర్చులతో రిపేర్ చేస్తామని ఎల్ అండ్ టీ ముందుకు వచ్చింది. కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అని బద్నాం చేద్దామనుకున్న రేవంత్ రెడ్డి ప్రచారానికి ఇది గండికొట్టింది. తమ రాజకీయ లబ్ధికి ఎల్ అండ్ టీ సహకరించలేదనే కోపంతో సీఎం ఆ సంస్థపై పగబట్టారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ మెట్రో వరకు ప్రతి విషయంలో ఆ సంస్థను వెంటాడి, వేధించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో టెండర్ వేసిన ఎల్ అండ్ టీకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి, తన అనుచరుడైన బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థకు పనులు కట్టబెట్టారు.
‘మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకుంటే బ్లాక్ లిస్టులో పెడతా’ అని బెదిరించారు. ఈ కక్ష సాధింపు చర్యలు భరించలేకే 2070 వరకు లీజు ఉన్న ఎల్ అండ్ టీ సంస్థ రాష్ట్రం నుంచి వాకౌట్ చేసింది. ‘తెలంగాణ రైజింగ్’ అని చెప్పుకొనే సీఎం పెట్టుబడులకు స్వర్గధామమైన రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఎందుకు పారిపోయిందో సమాధానం చెప్పాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు అప్పు పుట్టడం లేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.2.20 లక్షల కోట్లు అప్పు చేశారనీ, ఇప్పుడు దానికి తోడు రూ.15 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని కేటీఆర్ విమర్శించారు. ఎల్ అండ్ టీకి కేటాయించిన 280 ఎకరాల భూములను, ఉన్న మాల్స్ ను ఎవరెవరికి రాసిస్తారో త్వరలో చూస్తారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక్క స్కీంలో ఒక్కో స్కాం దాగుందని విమర్శించారు. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారనో నాలుగైదు రోజుల్లో బయటపెడతానని కేటీఆర్ వెల్లడించారు.