Sunday, January 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతుగ్లక్‌ను తలపిస్తున్న రేవంత్‌ రెడ్డి పాలన

తుగ్లక్‌ను తలపిస్తున్న రేవంత్‌ రెడ్డి పాలన

- Advertisement -

ఆరు గ్యారెంటీల అమలేది?
కేవలం పేర్లు మార్చే పనిలోనే సీఎం
సికింద్రాబాద్‌ ప్రజలకు అండగా ఉంటాం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి చేసిందేవిూలేదనీ, ఆయన నిర్ణయాలతో తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తుగ్లక్‌ ఎలా ఉంటాడో రేవంత్‌ రెడ్డిని చూసి అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలంటూ అధికారంలోకి వచ్చి వాటి అమలును మరిచి పేర్లు మార్చే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలుగా పేరుగాంచాయనీ, అవి తెలంగాణ ప్రజల అస్థిత్వ చిహ్నాలని తెలిపారు. అయితే రేవంత్‌ రెడ్డి తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయంతో సికింద్రాబాద్‌ చారిత్రక గుర్తింపును కోల్పోయేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌ సర్కారుపై ప్రజలంతా ఒక్కటై పోరాడుతున్నారని అన్నారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది మంచి చేయడానికే తప్ప అస్థిత్వ చిహ్నాలను చెరిపేసేందుకు కాదని కేటీఆర్‌ హితవు పలికారు. టీఎస్‌ స్థానంలో టీజీ అనీ, తెలంగాణ తల్లిని మార్చి, ఆమె నుంచి బతుకమ్మను తీసేసి, అధికార చిహ్నం కాకతీయ కళాతోరణంలో చార్మినార్‌ను తొలగించారని గుర్తుచేశారు. వీటితో ప్రజలకు ఏం లాభం జరిగిందని కేటీఆర్‌ ప్రశ్నించారు.

సికింద్రాబాద్‌ ప్రజల పోరాటానికి అండగా ఉంటాం
అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించేందుకు కేసీఆర్‌ వికేంద్రీకరణను విశాల దృక్పథంతో ప్రారంభించారని కేటీఆర్‌ తెలిపారు. కొత్త గ్రామాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లతో పాటు 10 జిల్లాలను 33 జిల్లాలకు మార్చారనీ, హైదరాబాద్‌లో వార్డులను, జోన్లను పెంచారనీ, వాటి అభివృద్ధికి అధికంగా నిధులిచ్చారని అన్నారు. కానీ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నగర విధ్వంస ప్రణాళికతో పని చేస్తున్నారని ఆయన విమర్శించారు.

శనివారం సికింద్రాబాద్‌ ప్రజలు, ప్రజా ప్రతినిధులు శాంతియుతంగా కార్యక్రమం చేపట్టారనీ, ప్రజల కోరిక మేరకు తెలంగాణ భవన్‌ నుంచి బయలుదేరి వెళ్లారని తెలిపారు. అలా వెళ్లిన వేలాది మంది ప్రజలతో పాటు కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, పార్టీ సీనియర్‌ నాయకులను అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సికింద్రాబాద్‌ అస్థిత్వాన్ని చెరిపేసే ప్రయత్నం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. శాంతి ర్యాలీ భగంతో తాత్కాలికంగా పైశాచికంగా ఆనందం పొందొచ్చనీ, మరోసారి కోర్టు వెళ్లి శాంతి ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. సికింద్రాబాద్‌ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.

మరోసారి అధికారంలోకి వస్తాం
మరోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు సికింద్రాబాద్‌ను మరొక జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు లేని సీఎం రేవంత్‌ రెడ్డి ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తామంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చిన్న జిల్లాలతో ప్రజల వద్దకు అధికారులు వస్తే రేవంత్‌ రెడ్డికి ఉన్న ఇబ్బందేంటని ప్రశ్నించారు. శనివారం అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -