సంక్షేమ బోర్డు నిధుల దారి మళ్లింపు వెంటనే ఆపాలి
ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు లబ్ది చేసే జీవో 12ను రద్దు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బిల్డింగ్ వర్కర్ల ధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బిల్డింగ్ అదర్ కన్‌స్ట్రక్షన్ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్ల కార్డులు, జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కార్మిక శాఖలో అవినీతిని అరికట్టాలనీ, సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాస్కర్ కార్మికుల నుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగులకు మడుగులొత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు మరణ శాసనంగా మారనున్నాయని హెచ్చరించారు.
రాష్ట్రం నుంచి బీజేపీ మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజరులను పైకి విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెం. 12ను సవరించి, కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలనీ, అక్రమంగా వారికిచ్చిన రూ.346 కోట్లు తిరిగి బోర్డులో జమ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు మాట్లాడుతూ 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి వారి నిర్ణయం ప్రకారమే నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ సెస్ ద్వారా సంక్షేమ బోర్డుకు రూ.5,800 కోట్లు రాగా, అందులో కేవలం రూ.1,570 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. మిగతా నిధులను నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయకుండా కార్మిక శాఖ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి ఎలాంటి గుర్తింపు లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములను అప్పగించి కార్మికుల నోట్లో మట్టిగొట్టారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2009 నుంచి 2025 వరకు బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులు 27,12,979 మంది ఉండగా, 15 లక్షల మంది సభ్యత్వం మాత్రమే రెన్యువల్ చేశారని అన్నారు. మిగతా 12 లక్షలకు పైగా కార్మికుల కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ టెస్ట్‌ల పేరుతో సీఎస్సీ సంస్థకు రూ.463 కోట్లు దోచి పెట్టారని మండిపడ్డారు. దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు పెండింగ్ పరిహారాలను వెంటనే విడుదల చేయాలనీ, 60ఏండ్లు పైబడిన కార్మికులకు పెన్షన్, పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందించాలని కోరారు. లేబర్ అడ్డాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లాంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం డిప్యూటీ లేబర్ కమిషనర్ జాన్సన్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు సుంకర రామ్మోహన్‌రావు, ఉపాధ్యక్షులు కె.జంగయ్య, జె.వెంకన్న, కార్యదర్శి కె.రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.మోహన్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.