నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నారు. వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) లలో ఒకదాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
డీఏ ప్రకటనతో పాటుగా.. ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిల చెల్లింపులు, అలానే పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు.. వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలపై కూడా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం.. తెలంగాణ సర్కార్ కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిపై జూన్ 2న ప్రకటన ఉండే అవకాశం ఉంది అంటున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. దీనిలో ముగ్గురు ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ఇప్పటికే అనేకసార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై.. వారి అభ్యర్థనలను విన్నది. ఈ కమిటీ ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు.. ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఉద్యోగులు సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నివేదికను ఆమోదించిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రకటనలు అన్ని జూన్ 2న న వెలుడే అవకావం ఉందంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకుంటారని అంటున్నారు. అంతేకాక రేవంత్ రెడ్డి చేసే ప్రకటన వల్ల.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.