Sunday, April 5, 2026
E-PAPER
Homeకరీంనగర్రేవంత్ పోవాలి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి

రేవంత్ పోవాలి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి

- Advertisement -

మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
నవతెలంగాణ – జగిత్యాల టౌన్ 

‘రెండేళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి పోవాలి.. మార్పు రావాలి’ అనే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కేసీఆర్ పోయి మార్పు రావాలనే నినాదంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి పాలన పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఇటీవలే రాజీనామా చేసిన జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

శుక్రవారం జగిత్యాలలోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇంతకాలం పార్టీలో తన అడ్డు తొలగించుకునేందుకే నామినేటెడ్ పదవుల్లో జాప్యం చేశారని, తాను రాజీనామా చేశాక పలు నామినేట్ పదవులను భర్తీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని పార్టీ సభ్యతమే తీసుకోకుండా పార్టీ కోసం ఎలాంటి కృషి చేయని వారికి పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. ఇంతకాలం తాను పార్టీలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించి పలుమార్లు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన గాని వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని ప్రస్తుతం తాను రాజీనామా చేసిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటి భర్తీ చేయడం గమనార్హం అన్నారు. 

కాళేశ్వరం పునరుద్ధరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం..
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలు రాజకీయకోణంలో మాత్రమే ఉన్నాయని, కానీ పునరుద్ధరణ పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి సీ.ఆర్. పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు మొత్తం ప్రాజెక్ట్ లలో చిన్న భాగమేనని తెలిపారు. మూడు బ్యారేజీలను పునరుద్ధరించడానికి సుమారు రూ.500 కోట్లలోపే ఖర్చవుతుందని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చినా అమలు చేయలేదని గుర్తుచేశారు. ప్రాణహిత నది జలాలను వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం సరైన డిజైన్ కూడా రూపొందించలేదని అన్నారు. బడ్జెట్ లో కేవలం రూ.152 కోట్లు మాత్రమే కేటాయించడం నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కడెం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా 100 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాధారమని, హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మూసిప్రక్షాళన అన్నీ దీనిపైనే ఆధారపడుతున్నాయని చెప్పారు. మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాల సాగు భూమి, హైదరాబాద్ అవసరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణను తక్షణమే చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తెలంగాణ సమాజం క్షమించదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

 బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల అభిమానానికి కృతజ్ఞతలు..
ప్రజా సేవ చేసే విషయంలో తప్పకుండా ఏదో ఒక పార్టీలో చేరాల్సిన ఆవశ్యకత ఉందన్న జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు అభిమానులు అనుచరుల అభిప్రాయం మేరకు తీసుకుంటానని అన్నారు. తనపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న మరో రెండు వారాల్లో తాను ఏపార్టీలో చేరుతాననేది మీడియా ద్వారానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడిన జీవన్రెడ్డి కేంద్రమంత్రి సీ.ఆర్. పాటిల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగేయడం చూస్తే ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించే విషయంలో అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఈ సారి జగిత్యాల జిల్లా కేంద్రంలో సమావేశాలు జరపాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా ఉంది. జగిత్యాల సమీపంలో వ్యవసాయ భూముల్లో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 ఏప్రిల్ 13 న చేరిక.?
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ప్లీనరీ సమావేశాల్లో జాయిన్ చేసుకోనున్నట్టుగా సమాచారం. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో బలమైన సంకేతాలను పంపించేందుకు ప్లీనరీ వేదికను వినియోగించుకోవాలన్న యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్లీనరి సభ వేదిక మీదుగానే అధినేత కేసీఆర్ జీవన్ రెడ్డికి అప్పగించే బాధ్యతలను కూడా ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -