– తెలంగాణలో త్వరలో ఆర్థిక ఎమర్జెన్సీ
– అందుకే సీఎస్‌గా రామకృష్ణారావు నియామకం
– సీఎంకు వ్యతిరేకంగా అధిష్టానానికి మంత్రుల ఫిర్యాదులు : చిట్‌చాట్‌లో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా సీఎం రేవంత్‌రెడ్డే ఉన్నారనీ, ఈ విషయంలో ఆశావహులను ఎగదోస్తూ, ఆయా సామాజిక తరగతుల వారితో లేఖలు ఇప్పిస్తూ జగన్నాటకం ఆడుతున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించబోతున్నారనీ, అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును నియమించారని బాంబుపేల్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. తనకనుకూలమైన వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం లేకపోవడంతో రేవంత్‌రెడ్డి క్యాబినెట్ విస్తరణను అడ్డుకుంటున్నారని బాంబు పేల్చారు. వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్య, ఆదిశ్రీనివాస్, తదితర బీసీ ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నాడనీ, మరోవైపు తమ సామాజిక తరగతుల వారికి మంత్రి పదవి ఇవ్వాలని లంబాడీ, మాదిగ సామాజిక తరగతులకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవి విషయంలో పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల మధ్య తగువు పెట్టారని ఎత్తిచూపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డితో అధిష్టానానికి రేవంత్‌రెడ్డి లేఖ రాయించారని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌కు మంత్రి పదవులు గ్యారెంటీ అని చెబుతూనే సుదర్శన్‌రెడ్డిని ఎగదోస్తున్నారనీ, సామాజిక పొందిక పేరుతో జగన్నాటకం ఆడుతున్నారని వివరించారు. బీసీలైన పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలకు పనికిరాని శాఖలు ఇచ్చారనీ, సీఎం కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారని విమర్శించారు. మంత్రి వర్గ విస్తరణ జరిగితే దామోదరరాజనర్సింహ్మ, పొన్నం ప్రభాకర్‌లతో పాటు కొత్త మంత్రులకు తన దగ్గర ఉన్న మున్సిపల్, హోం, విద్యా, తదితర కీలక శాఖలను వారికి అప్పగించాలనే భయం కూడా రేవంత్‌రెడ్డిని వెన్నాడుతున్నదన్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న సీఎం సర్వర్లకు ఇచ్చే మాదిరిగా తమకిచ్చే టిప్పులు అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయే వరకూ ఆగాలని అధిష్టానం నచ్చజెప్పడంతోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు ఆగుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎం మార్పు తధ్యమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారనీ, స్వయంగా ఆర్థిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు మాత్రం దీనిపై స్పందించలేదని చెప్పారు. ఆర్థిక ఎమర్జెన్సీ చూపి సంక్షేమ పథకాలు, ఉద్యోగుల వేతనాల పెంపు నుంచి తప్పించుకునే కుట్రకు రేవంత్‌రెడ్డి తెరలేపారని విమర్శించారు. కొన్ని శాఖల్లో సీఎం నేరుగా జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. దీంతో మంత్రులు రెండు గ్రూపులుగా చీలిపోయారని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒంటెత్తుపోకడలతో విసిగిపోయిన కొందరు మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా అధిష్టానానికి నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణకు రేవంతే అడ్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES