Thursday, May 8, 2025
Homeఎడిట్ పేజిపహల్గాంకు ప్రతీకారం!

పహల్గాంకు ప్రతీకారం!

- Advertisement -

మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం నాడు పాకిస్థాన్‌, అది ఆక్రమించిన కాశ్మీరు ప్రాంతంలోని ఉగ్రమూకలపై మనసైన్యం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో జరిపిన మెరుపుదాడుల్లో 25 నిమిషాల్లో 21శిబిరాలను ధ్వంసం చేసినట్లు వార్తలొచ్చాయి. 2019లో పుల్వామా పారా మిలిటరీ సిబ్బంది కాన్వారుపై జరిపిన ఉగ్రదాడిలో 46 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాక్‌ బాలాకోట్‌లోని ఉగ్రశిబిరంపై మన మెరుపు దాడి తరువాత పాకిస్థాన్‌తో ఇదే పెద్ద ఉదంతం. ఈ వార్త వెలువడగానే దేశవ్యాపితంగా పహల్గాంలో అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గానికి తగిన ప్రతీకారం తీర్చుకున్నందుకు హర్షాతిరేకాలు వెల్లడయ్యాయి, అనేక చోట్ల సంబరాలు జరుపుకున్నారు.బాధిత కుటుంబాల్లో దెబ్బకు దెబ్బ తీశారన్న సంతృప్తి సహజంగానే వెల్లడైంది. ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులను మట్టుబెడితేనే సంపూర్ణం అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయి. ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం జరిపిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రవాదం, ఉగ్రమూకలపై తీసుకొనే చర్యలకు పూర్తి మద్దతిస్తామని అన్ని పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కొనసాగింపుగానే ఈ దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు, యుద్ధాలతో పాటు ప్రచారదాడి తోడౌతుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తున్నది.
గతంలో ఆఫ్ఘనిస్తాన్‌, వర్తమానంలో ఉక్రెయిన్‌ పోరులో జరిగినట్లు చెప్పిన వార్తలు, చూపిన గ్రాఫిక్స్‌, వీడియోలను చూస్తే మనకు ఈ అంశం స్పష్టమవుతుంది. తాజాగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, ఆరెస్సెస్‌ నేత కెబి హెడ్గెవార్‌ ఒకే మోటార్‌ సైకిల్‌ మీద ప్రయాణించినట్లు ఒక కృత్రిమ మేధ ఫొటోను సామాజిక మాధ్యమంలో కొందరు కుట్రపూరితంగా వైరల్‌ చేసిన సంగతి తెలిసిందే. బాలాకోట్‌ మెరుపుదాడిలో అక్కడ ఉన్న జైషే మహమ్మద్‌ శిక్షణా శిబిరం కూల్చివేత దాడిలో మూడు వందల మంది తీవ్రవాదులను మట్టుపెట్టినట్లు నాడు ప్రచారం జరిగింది. నిజంగా ఎందరన్నది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. దాడి జరిగిన నెలన్నర తర్వాత అక్కడకు వెళ్లిన విదేశీ జర్నలిస్టులకు దెబ్బతిన్న లేదా వాటి స్థానంలో నూతనంగా నిర్మించిన కట్టడపు జాడలు కూడా లేవని వార్తలొచ్చా యి. అందువలన ఇప్పుడేం జరిగిందన్నది వెంటనే తెలిసే అవకాశాలు పరిమితం.
ఈ దాడిలో తన కుటుంబానికి చెందిన పిల్లలతో సహా పది మంది, మరో నలుగురు సహాయకులు మరణించినట్లు తీవ్రవాద జైషే మహమ్మద్‌ సంస్థనేత మసూర్‌ అజాద్‌ పేరుతో వెలువడిన ప్రకటన వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 26 మంది పౌరులు మరణిం చినట్లు, అనేక మంది గాయపడినట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇవిగాక నిర్ధారణ గాని వార్తల ప్రకారం వందమంది తీవ్రవాదులు మరణించినట్లు, రెండు పాక్‌ యుద్ధ విమానాలను కూల్చినట్లు, ఇతరంగా పెద్దనష్టం చేసినట్లు మీడియా, సోషల్‌ మీడియా పేర్కొన్నది. మరోవైపున మన వాయుసేనలోని మూడు రాఫెల్‌, రెండు రష్యన్‌ మిగ్‌ విమానాలను కూల్చివేసినట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది, అయితే వీటి గురించి అవునని గానీ కాదని గానీ బుధవారం ఉదయం జరిపిన మీడియా సమావేశంలో మన విదేశాంగ శాఖ చెప్పలేదు. వేర్వేరు చోట్ల మూడు విమానాలు కూలిపోయినట్లు కాశ్మీరు ప్రభుత్వ అధికార వర్గాలు చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది తప్ప నిర్దారించలేదు. ఇలాంటి పెద్ద ఉదంతాలు జరిగినపుడు రెండు వైపులా జరిగిన నష్టాన్ని తక్కువ, ఎక్కువ చూపేందుకు ఇరుపక్షాలు ప్రయత్నిస్తాయన్నది వేరే చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ స్పందన చూస్తే మొత్తం మీద ఒక్క ఇజ్రాయిల్‌ తప్ప అన్ని దేశాలూ, ఐరాస కూడా ఆచితూచి సంయమనం పాటించాలని ఉభయపక్షాలకు హితవు పలికాయి. ఉగ్రస్థావరాలపై దాడులకు ప్రతిగా పాక్‌ సైన్యం మనదేశ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసింది. వాటిలో ఎనిమిది మంది మరణించినట్లు వార్తలు.
దాడులకు ముందు పాక్‌ ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసి దేశంలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని మీడియాలో అనేక ఊహాగానాలు వెలువడినప్పటికీ కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే దాడి జరిపాం తప్ప పాక్‌ మిలిటరీ కేంద్రాల జోలికి పోలేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి పరిమితమైతే తాము కూడా తగ్గుతామన్నట్లు పాక్‌ సంకేతం పంపిందని వార్తలొచ్చాయి. ఏం జరుగుతుందో చెప్పలేము గానీ, యుద్ధం జరిగే అవకాశాలైతే లేవని, ఎవరూ కోరుకోవటం లేదన్నది స్పష్టం. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు ఉగ్రవాదులను అప్పగించేందుకు, తమ గడ్డ మీద ఉగ్రస్థావరాలు లేకుండా చూసేందుకు పాకిస్థాన్‌ మీద మన ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిడి చర్యలను తీసుకు రావాల్సి ఉంటుంది. పహల్గాంను ఉపయోగించుకొనేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్ని స్తున్నాయి. రెచ్చగొట్టే శక్తులను అదుపు చేస్తూ దేశంలో ఇప్పటివరకు వెల్లడైన మహత్తర ఐక్యత, సజ్జనత్వాలను కాపాడేందుకు కూడా ప్రభుత్వ చర్యలు తీసుకోవటం అవసరం. ఒకసారి ఉగ్రమూకల శిబిరాలను ధ్వంసం చేసి కొంతమందిని మట్టు బెట్టినంత మాత్రాన ఉగ్రవాదం అంతం కాదు, ఇది నిరంతరం కొనసాగాల్సిందే అన్నది గతం నేర్పిన పాఠం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -