ప్రభుత్వానికి రాని ఆశించిన ఆదాయం
2025-26లో రెవెన్యూ ఖర్చులో భారీ లోటు
ఖర్చు చేయాల్సింది రూ.2.29 లక్షల కోట్లు, చేసింది రూ.1.38 లక్షల కోట్లు
2024-25లో వాస్తవ ఖర్చు 80 శాతం నిధులే :కాగ్ నివేదికలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రాలేదు. దీంతో ఆదాయానికి సంబంధించిన అంచనాలు, వ్యయం మధ్య భారీగా లోటు ఏర్పడింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఈ అంశాలను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2.29 లక్షల కోట్ల రాబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 2026 జనవరి నాటికి ప్రభుత్వం రూ.1.38 (60.23 శాతం) లక్షల కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఫిబ్రవరి, మార్చి కలిపినా 75 నుంచి 80 శాతం వరకు చేరే అవకాశమున్నది. అదే కాలానికి రెవెన్యూ వ్యయం 2.26 లక్షల కోట్లు అని అంచనా వేస్తే జనవరి నాటికి రూ.రూ.1.48 (65.62 శాతం) లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఫిబ్రవరి, మార్చి కలిపినా ఆ వ్యయం 80 శాతానికి చేరుకునే అవకాశమున్నది.
దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాల లక్ష్యాలను ప్రభుత్వం పూర్తిగా సాధించే అవకాశం లేదని తెలుస్తున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ రాబడుల లక్ష్యం రూ.2.41 లక్షల కోట్లు అని ప్రకటించింది. ఇదే కాలంలో రెవెన్యూ వ్యయం రూ.2.34 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. గత అనుభవాలు ఉన్నా రెవెన్యూ ఆదాయం, వ్యయానికి సంబంధించి అంచనాలు భారీగా పెంచడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.21 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ వాస్తవంగా వచ్చింది రూ.1.77 లక్షల కోట్లు మాత్రమే. కాగ్ ఫైనాన్స్ అకౌంట్స్ నివేదిక ప్రకారం రాష్ట్రం మొత్తం రెవెన్యూ, మూలధన వ్యయాలను కలిపి రూ.2.74 లక్షల కోట్లు అని అంచనా వేసింది. కానీ వాస్తవ ఖర్చు రూ.2.18 (80 శాతం) లక్షల కోట్లు మాత్రమే. ఈ గణాంకాలను బట్టి అంచనాలు భారీగా ఉన్నా వాటిని చేరుకోవడం కష్టంగా ఉన్నది. ఆదాయ వ్యయం అంచనాలకు వాస్తవ ఖర్చుకు ఆమడదూరంలో ఉన్నది.
పెరిగిన మూలధన వ్యయం
రాష్ట్రంలో రెవెన్యూ వ్యయం తగ్గింది. కానీ మూలధన వ్యయం పెరగడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లు అంచనా వేస్తే రూ.36,082 (109 శాతం) కోట్లకు పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.36,504.45 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి రూ.44,376.34 (121 శాతం) కోట్లు ఖరు చేసింది. ఫిబ్రవరి, మార్చిలో మూలధన వ్యయం కలిపితే అది రూ.60 వేల కోట్లకు చేరుకునే అవకాశమున్నది.
వడ్డీ, జీతాలు, పెన్షన్ల భారం పెరుగుదల
రాష్ట్రంలో వడ్డీ చెల్లింపుల భారం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.17,739 కోట్లు వడ్డీ చెల్లింపులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రూ.26,688 కోట్లు చెల్లించడం గమనార్హం. అంటే రూ.తొమ్మిది వేల కోట్లు అధికంగా చెల్లించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ.19,369.02 కోట్లు చెల్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 24,085.22 (124.35 శాతం) కోట్లు చెల్లించింది. అంటే జనవరి నాటికే రూ.4,716.2 కోట్లు అదనంగా చెల్లింపులు చేసిది.
ఇంకా ఫిబ్రవరి, మార్చి కలిపితే వడ్డీ చెల్లింపులు రూ.30 వేల కోట్లకు చేరే అవకాశమున్నది. జీతాలు రూ.44,478.87 కోట్లు చెల్లించాలని అంచనా వేస్తే జనవరి నాటికి రూ.39,858.28 (89.61 శాతం) కోట్లు చెల్లించింది. పెన్షన్లకు సంబంధించి రూ.13,109.67 కోట్లు చెల్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఏడాది జనవరి నాటికే రూ.15,717.10 (119 శాతం) కోట్లు చెల్లించింది. దీంతో ప్రభుత్వంపై వడ్డీలు, జీతాలు, పెన్షన్ల భారం పెరిగిందని తెలుస్తున్నది. ఇవి బడ్జెట్ అంచనాలను మించి ఖర్చు చేయడం గమనార్హం.
పన్నేతర ఆదాయం అంతంతే
ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం తగ్గుతున్నది. అంచనాలకు అనుగుణంగా రాబడి రావడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.21 లక్షల కోట్ల ఆదాయం వస్తుంని అంచనా వేసింది. కానీ వాస్తవంగా రూ.1.69 లక్షల కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అంటే రెవెన్యూ ఆదాయంలో లోటు రూ.52 లక్షల కోట్లు ఉన్నది. ఇక పన్నేతర ఆదాయం కూడా ప్రభుత్వం ఆశించినట్టుగా రావడం లేదు. 2024-25లో రూ.35,208 కోట్లు వస్తాయని అంచనా వేస్తే రూ.23,607 కోట్లు మాత్రమే వచ్చాయి. 2025-26లో రూ.31,618.77 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి నాటికి రూ.7,864.18 (24.87 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చితో కలిపితే రూ.15 వేల కోట్లకు చేరొచ్చు. అయినా పన్నేతర ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదని అర్థమవుతున్నది. 2024-25లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.21,636 కోట్లు ఇస్తుందని అంచనా వేసింది.
కానీ రూ.7,913 (36.57 శాతం) కోట్ల నిధులను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.22,782.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ జనవరి నాటికి రూ.4,213.29 (18.49 శాతం) కోట్లు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో మూలధన ఆదాయం రూ.55,116.67 కోట్లు వస్తాయని అంచనా వేస్తే జనవరి నాటికి రూ.69,187.07 కోట్లు రావడం గమనార్హం. 2024-25లో రెవెన్యూ లోటు రూ.తొమ్మిది వేల కోట్లు నమోదైంది. 2025-26లో జనవరి నాటికి రూ.10,566.34 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి, మార్చి కలిపితే రెవెన్యూ లోటు మరింత పెరగనుంది. ద్రవ్యలోటు రూ.54,009.72 కోట్లు అంటుందని అంచనా వేస్తే జనవరి నాటికి రూ.69,148.29 కోట్లకు చేరింది. ఫిబ్రవరి, మార్చి కలిపితే మరింత పెరిగే ప్రమాదమున్నది.



