నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు పురోగతిపై పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో 10 మందికి తక్కువ మంది పనివారితో పనులు కొనసాగిస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ అదనపు కార్యక్రమ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష జరిపారు.
గ్రామాల్లో ఎక్కువ మంది ఉపాధి హామీ పని వారు పనిలోకి తీసుకురావడం, ప్రగతిలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయడం, లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఇందిరమ్మ గృహనిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ వేతనాలు, మెటీరియల్ చెల్లింపుల లక్ష్యాలను సమయానికి పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ అదనపు కార్యక్రమ అధికారులు పాల్గొన్నారు.



