Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

- Advertisement -

– మహిళల ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యత
– వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ
– ఏఐజీ ఆస్పత్రిని సందర్శించిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ తెలిపారు. మెడికల్‌ టూరిజంలో భాగంగా శుక్రవారం మిస్‌ వరల్డ్‌ పోటీదారులు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి బతుకమ్మలతో ఆస్పత్రి నిర్వాహకులు స్వాగతం తెలిపారు. వారు ఆస్పత్రిని ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి పలకరించారు. వారికి బహుమతులను అందజేశారు. ఫొటోలు దిగారు. ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వివిధ రకాల సేవలను డాక్టర్లు, సిబ్బంది వారికి వివరించారు. ఈ సందర్భంగా క్రిస్టీనా మాట్లాడుతూ ప్రపం చవ్యాప్తంగా మహిళలు అనేక పాత్రలను పోషిస్తున్నారనీ, తల్లులుగా, కుమార్తెలుగా, ఆరోగ్య సంరక్షణ కార్మికులుగా, వృత్తిపరంగా పని చేస్తున్నారని తెలిపారు. మహిళల ఆరోగ్యం అనేది ఒక మౌలికాంశమని అర్థం చేసుకోవడం అత్యంత కీలకమని సూచించారు. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మహిళలుగా మనం ప్రాధాన్యమిస్తే కార్యాలయాలు, సమాజం మరింత బలోపేతమౌతాయని వివరించారు. మహిళల్లో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి అధునాతన ఆస్పత్రుల్లో సేవలు అందిస్తుందని అన్నారు. మెడికల్‌ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా రూపకల్పన చేస్తున్నామని అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు మహిళా డాక్టర్లు, సిబ్బందితో చికిత్సలందిస్తున్నామనీ, తద్వారా మహిళలు తమ ఇబ్బందులను మరింత స్వేచ్ఛగా చెప్పుకునే వెసులుబాటు కలుగుతున్నదన్నా రు. ఏఐజీ ఆస్పత్రుల చైర్మెన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వారికి ఆస్పత్రి ప్రత్యేకతలను వివరించారు. తమ వద్ద జరుగుతున్న చికిత్స విధానాలను, పరిశోధనల తీరును వివరించారు. ఆరోగ్య రంగంలో సాధించిన పురోగతిని, బ్రెస్ట్‌ వెల్‌నెస్‌, ‘గట్‌’ (జీర్ణ వ్యవస్థ), వంటి అంశాలను ప్రచారం చేయాలని వారికి సూచించారు. వైద్య రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, మహిళల్లో వస్తున్న వ్యాధులను ఆయన వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ ఆహారం, ఆరోగ్యంపై దృష్టి పెడితే సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుందని సూచించారు. ఆస్పత్రిని సందర్శించిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులు కూడా తమ అభిప్రాయాలను నాగేశ్వరరెడ్డితో పంచుకున్నారు. ఏఐ రంగంలో వస్తున్న మార్పులు, దాన్ని ఏఐజీ ఆస్పత్రి ఎలా అందిపుచ్చుకుంటుందన్న విషయాలను వారు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -