– ఆదుకోవాలంటూ కలెక్టర్‌కు రైస్ మిల్లర్ల అసోసియేషన్ వినతి
నవతెలంగాణ – కరీంనగర్
రాష్ట్రంలో రైతాంగానికి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవలందిస్తున్న రైస్ మిల్లింగ్ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం నగరంలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి.నర్సింగరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న ఈ పరిశ్రమలో ఇప్పటికే మూడోవంతు మిల్లులు డిఫాల్టర్లుగా మారాయని తెలిపారు. ఇటీవల జిల్లాలో మహిళా మిల్లర్ స్వప్న ఆత్మహత్య చేసుకోవడం పరిశ్రమలోని దీనస్థితికి అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సివిల్ సప్లయి బియ్యం బాకీని నాలుగు వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. కొన్నేండ్లుగా నిలిచిపోయిన మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్, డ్రైయేజ్, కస్టోడియన్ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అధిక విద్యుత్ చార్జీలు, ధాన్యం సేకరణలో జాప్యం, తరుగు, నాణ్యత లేకపోవడం వల్ల నూకలు ఎక్కువగా రావడం వంటి కారణాలతో మిల్లర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని వివరించారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కరుణాకర్, అడిషనల్ సెక్రటరీ జి.రాజమౌళి, కోశాధికారి జి.ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నష్టాల ఊబిలో రైస్ మిల్లులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



