– ఆయిల్ పంట సాగుతో అధిక లాభాలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ రైతు వేదికలో బుధవారం ఆయిల్ ఫామ్ పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ, ఉద్యానవన అధికారి రాజు ఆయిల్ ఫామ్ కంపెనీ అధికారి మధు, రైతులకు ఆయిల్ పంటసాగు పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి రాజు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడానికి పలు రకాల సబ్సిడీ లతో సాగును ప్రోత్సహిస్తుందన్నారు.
ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30సంవత్సరాల పాటు ఇస్తుందని తెలిపారు.కోతులు ముట్టని, పందుల బెడద, దళారుల మోసం, దొంగల బెడద ఉండదన్నారు. తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ ఫామ్ పంట అని తెలిపారు.రైతులు ఒక ఎకరం వరి పండించే నీటితో 3 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసుకొని అధిక ఆదాయం రాబటవచ్చని తెలిపారు. ఈ పంటకు ఎన్ ఎంఈఓ- ఓపి స్కీమ్ కింద సబ్సిడీలు ఉన్నాయనీ వివరించారు.
మొక్కలకు 90 శాతం రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు.ఆయిల్ ఫామ్ మధ్యలో అంతర పంటల సాగు (మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా) చేసినందుకు గాను ఎకరానికి రూ.4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని వివరించారు.ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులైతే 100 శాతం రాయితీ, 5 ఎకరాల మీదా సాగు చేసేవారు 80 శాతం రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.



