– బాయిల్డ్ రైస్ ను తరలించి గిడ్డంగులను ఖాళీ చేయించాలి
– వరి దిగుబడి రికార్డును గుర్తించి సహకరించాలి
– లేకపోతే.. తలెత్తే పరిస్థితులకు కేంద్రానిదే బాధ్యత : మంత్రి ఉత్తమ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బియ్యం సబ్సిడీ రూ.6,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల కేంద్ర కార్యా లయంలో ఆయన వానాకాలం ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కనిష్ట మద్దతు ధర కింద రూ.21,112 కోట్లు అవుతుందనీ, ఇందులో నేరుగా రైతులకు చెల్లింపుల కింద రూ.19,112 కోట్లు వెచ్చించ నున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ కింద చెల్లింపులకు రూ.3,159 కోట్లు అవసరమని తెలిపారు. కేంద్రం సబ్సిడీని సకాలంలో విడుదల చేస్తే ధాన్యం చెల్లింపులో జాప్యం కాకుండా ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ వానాకాలంలో దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణలో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతున్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 67.57 లక్షల ఎకరాల వరి సాగులో 40.75 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26.82 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్ల సాగు చేశారన్నారు. ఇందులో సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 57.84 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం కలిపి 148.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నట్టు ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో దిగుబడి మొదటిసారి అని తెలిపారు. ధాన్యం నిల్వ ఉంచేందుకు గిడ్డంగుల కొరతపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆహార సంస్థ అధ్వర్యంలోని గిడ్డంగులు 22.61 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యముండగా ఇప్పటికే 21.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలున్నాయని తెలిపారు. కేవలం 0.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచేందుకు మాత్రమే ఖాళీగా ఉందని మంత్రి కేంద్రానికి గుర్తు చేశారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయకపోవడంతో ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో వానాకాలం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు స్థలం కొరవడిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బాయిల్డ్ రైస్‌ను వినియోగించే రాష్ట్రాలకు సత్వరమే తరలిం చాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ మంత్రి, ఎఫ్‌సీఐ సీఎండీలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్టాక్ తరలింపుకు ఆదనపు రైళ్లను కేటాయించాలనీ, కేంద్రం ఈ విషయంలో సహకరించకుంటే ధాన్యం కొనుగోలులో ఉత్పన్న మయ్యే పరిస్థితులకు కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కొనుగోళ్ల అంశంలో అధికారులు ఎఫ్‌సీఐతో సమన్వయం చేసుకుని ప్రణాళికలు రూపొందించు కోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
బియ్యం సబ్సిడీ రూ.6,500 కోట్లు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES