కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కార్మిక కోడ్లను అమల్లోకి తెస్తూ, ‘ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికులకు అత్యంత మేలుచేసే కార్మిక అనుకూల సంస్కరణలు’గా ప్రచారం చేస్తున్నది. ఈ కోడ్లతో కార్మిక చట్టాలలో ఉన్న సంక్లిష్టతను తొలగిస్తూ, పెట్టుబడులను ఆకర్షించడానికి సామాజిక భద్రతను విస్తృతంగా అందించడానికని ఊదరగొడుతున్నది. సరళతరం పేరుతో తీసుకువచ్చిన ఈ కోడ్లు ఏళ్ల తరబడి దేశంలోని రెక్కాడితే డొక్కాడని కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మికుల చట్టాలతో పాటు హక్కులను కాలరాస్తున్నాయి. ఉద్యోగ భద్రతను గాలిలో దీపంలో నిలబెడుతున్నాయి. కార్మిక సంఘాలను బలహీనపరిచేలా, అసంఘటిత రంగ కార్మికులను పెంచేలాగా ఉపయోగ పడుతున్నాయి. ప్రమాదంలో ఉద్యోగ భద్రత కంపెనీలకు, పారిశ్రామిక అధిపతిలకు కార్మికుల తొలగింపులను ఇవి సులభతరం చేస్తున్నాయి. పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో ఇప్పటి వరకు లే ఆఫ్ ప్రకటించడానికి వందమంది కార్మికులు అంతకంటే ఎక్కువ ఉండే పరిశ్రమలకు ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ, ఈ పరిమితిని మూడువందల మంది కార్మికులకు పెంచడం ద్వారా కోట్ల మంది కార్మికులకు సామాజిక రక్షణకు దూరమయ్యారు. అనేక రంగాలలో పరిమిత కాల నియామకాలను ఈ కోడ్లు అనుమతిస్తుంది.అనగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల నియామకాలను నిరుత్సాహపరిచి కార్మికుల ఉద్యోగ భద్రతను గాలికొదిలేశాయి. ఇది కార్మికులు బేరమాడే శక్తి నుండి నిర్వీర్యం చేస్తుంది. నిరంతరం ఉద్యోగ భద్రతపై భయంతో బానిసలాగా పనిచేయాల్సిన పరిస్థితులలోకి కార్మికులను నెట్టే ప్రమాదం ఉంది. నాణ్యమైన ఉద్యోగ నియామకాల స్థానంలో ఇటువంటి నిబంధనలు ఉద్యోగభద్రత లేని పొరుగుసేవల నియామకాలను మరింత వేగవంతం చేస్తుంది.
సమ్మె హక్కు, సంఘాల ఏర్పాటుపై ఆంక్షలు కార్మికులు వారి న్యాయమైన కోర్కెల కోసం అనేక రకాల ప్రయత్నాల తర్వాత చివరి ఆయుధంగా సమ్మెను ప్రయోగించి వారి హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి బలమైన ఆయుధం కార్మికుల చేతి నుండి దూరం చేయడమే లక్ష్యంగా ఈ చట్టాలు రూపొందించారు. సమ్మె నోటీసు ఇచ్చిన పద్నాలుగు రోజులకు తర్వాత మాత్రమే సమ్మెకు వెళ్లాలనే నిబంధన విధించారు. ఈ కాలంలో కార్మికుల డిమాండ్లపై కోర్టు కేసు ఉంటే సమ్మెకు వెళ్లడానికి నిరాకరిస్తుంది. ఈ పేరుతో యాజ మాన్యాలు కోర్టుల ద్వారా సమ్మెహక్కును నిర్వీర్యం చేస్తాయి. యాభైశాతం మంది పైగా కార్మికులు సెలవులోకి వెళ్లడాన్ని సమ్మెగా పున: నిర్వ చించడం ద్వారా కార్మికులను జాతీయస్థాయి సార్వత్రిక సమ్మె పాల్గొనడానికి, అదేవిధంగా సమ్మెకు మద్దతుగా ఇతర వర్గాల వారు పాల్గొనడాన్ని నిలుపుదల చేస్తుంది. దీనితో సమ్మెహక్కు అనే కార్మికుల బలమైన ఆయుధం యజమానుల చేతిలో కీలుబొమ్మగా మారి కార్మి కులు బేరమాడే శక్తిని నిర్వీర్యంచేసి కట్టు బానిసలుగా మార్చే ప్రమాదం ఉంది. గిగ్ కార్మికులను గుర్తింపు ఇవ్వడం ద్వారా రక్షణ పరిధిలోకి తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయంగా పాలకులు చేస్తున్న ప్రచారం బూటకంగా మారింది. వాస్తవానికి గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత పథకాలకు, పెన్షన్లకు, ఆరోగ్య పథకాలకు సంబంధించిన నిధులకు యజమాని నుండి ఎటువంటి చెల్లింపు లేకుండా చేస్తుంది. మహిళా కార్మికులకు రాత్రి సమయంలో పనిచేయడానికి లేబర్‌కోడ్స్ సహకరిస్తాయి. సరైన రక్షణ చర్యలను రవాణా సదుపాయాలని, గ్రీవెన్స్ యంత్రాంగాలను ఏర్పరచకుండా దీన్ని అమలు చేయడమంటే మహిళలను మరింత ప్రమాదంలో పెట్టడమే.
కార్మికుల నిరసనలు, పారిశ్రామికవేత్తలు అనుకూల ప్రచారాలు, అంతర్జాతీయ పెట్టుబడి దారులు ఈ చట్టాలను అత్యంత అనుకూల సంస్కరణలుగా ఆకాశానికెత్తుతున్నాయి ఈ దేశ సంపద సృష్టికర్తలైన కోట్లకొలది కార్మికులు, వారి ప్రతినిధి సంఘాలు ఈ చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలుగా రద్దు చేయాలని విధిగా పోరాటాలు చేస్తున్నాయి. అంటే, ఇవి ఎవరి ప్రయోజనం కోసమో స్పష్టమవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల ఈజ్ ఆఫ్ లివింగ్‌ని బలిపెట్టడం ద్వారా ఈ పాలకులు సంపద సృష్టికర్తలైనా కోట్లాది మంది కార్మికుల వైపు కాకుండా పెట్టుబడిదారులవైపు ఒరిగిపోయారనేది స్పష్టం. 1920 నుండి దేశంలోని కార్మికులు ఐక్యంగా వారి హక్కుల కోసం పోరాటం చేసి అనేక విజయాలను సాధించారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడివీధిలో నిలబడి చట్టాలను రద్దు చేయించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో పోరాడితేనే కార్మికుల హక్కులు రక్షించబడతాయి.
– జి.వెంకటేశ్వరరావు,9966135289
హక్కులు నిర్వీర్యం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



