Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లు

ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లు

- Advertisement -

హైదరాబాద్‌ నుంచి నిర్దేశిత సమయంలో చేరేలా ప్రణాళికలు
బోధన, పెద్దాసుపత్రుల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి
ప్రభుత్వ శాఖలు ఈవీ వాహనాలే కొనుగోలు చేయాలి : ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడటంతోపాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్‌అండ్‌బీ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్‌ రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా జిల్లా కేంద్రాల నుంచి రింగు రోడ్లకు అనుసంధానించేలా రేడియల్‌ రోడ్లు నిర్మించాలని తెలిపారు. జాతీయ రహదారులకు రింగు రోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే నుంచి నాగార్జున సాగర్‌ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన నూతన ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బోధనాసుపత్రులు, ఇతర పెద్దాసుపత్రుల నిర్మాణలను త్వరగా పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

కాలుష్య రహిత రవాణాయే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ప్రభుత్వంలోని ఏ శాఖ అయినా తప్పనిసరిగా ఎలక్ట్రిక్‌ వాహనాలనే (ఈవీ) కొనుగోలు చేయాలని నొక్కి చెప్పారు. క్యూర్‌ పరిధిలో ప్రభుత్వ శాఖల పరిధిలో అద్దెలకు తీసుకునే వాహనాలు సైతం ఈవీలే ఉండాలని తెలిపారు. రవాణా శాఖలోని మాన్యువల్‌ పద్ధతులకు స్వస్తి చెప్పాలని.. మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆర్‌టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, వెంటనే సొంత భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచాలని, ఇందుకు షార్ట్‌ ఫిల్మ్‌లు ప్రదర్శించాలని సీఎం సూచించారు. శంషాబాద్‌ సమీపంలో హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రారంభమయ్యే ప్రాంతంలో అధునాతన బస్‌ టెర్మినల్‌కు స్థలం కేటాయిస్తామని అన్నారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -