– రూ.12 వేల కోట్ల అంచనా వ్యయం
– అక్టోబరులో రైల్వే బోర్డుకు డీపీఆర్
– ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా
392 కి.మీతో రింగ్‌రైల్ ప్రతిపాదన
– ఆ చుట్టుపక్కల భారీగా టౌన్‌షిప్‌లు
– ఆర్ధికాభివృద్ధికీ అవకాశం
– త్రిబుల్ ఆర్ భూసేకరణకు తాత్కాలిక బ్రేక్
– రింగ్‌రైల్ కూడా కలిపి భూసేకరణ చేయాలని ప్రతిపాదనలు
– పరిహారంపై ఎన్‌హెచ్‌ఏఐ మంకుపట్టు
బి బసవపున్నయ్య
ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా కొత్త రవాణా వ్యవస్థకు దక్షిణ మధ్య రైల్వే ఊపిరిపోయనుంది, 392 కి.మీతో ఔటర్ రింగ్ రైల్(ఓఆర్‌ఆర్) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే సర్వే ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే, వచ్చే అక్టోబరు నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేబోర్డుకు పంపనుంది. దేశానికే తలమానికంగా రూ. 12,070 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మరే ఇతర రాష్ట్రంలోనూ ఈ తరహా ప్రాజెక్టు లేకపోవడం గమనార్హం.
ఎనిమిది జిల్లాలు..26 స్టేషన్లు
ఎనిమిది జిల్లాల పరిధిలోని 14 మండలాల్లో 26 కొత్త రైల్వే స్టేషన్లు ఓఆర్‌ఆర్‌తో రానున్నాయి. ఆరు రైల్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌తో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ భారీ టౌన్‌షిప్‌లు కొత్తగా రావడంతోపాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వ నుంది. కనెక్టివిటీ పెరిగి, ట్రాఫిక్ తగ్గుతుందని అంచనా. ఓఆర్‌ఆర్‌ను పాత మెట్రోతో ఎంఎంటీఎస్‌కు అనుసం ధానం చేయనున్నారు. హైదరాబాద్‌పై భారాన్ని తగ్గించ డం, గ్రామీణ పట్టణాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్యఉద్దేశ్యం. బస్సు స్టేషన్లనూ అనుసంధానం చేస్తారు.
రెండు విడతల్లో పూర్తి
ఔటర్ రింగు రైల్‌ను రెండు విఢతల్లో పూర్తి చేస్తారు. మొదటి విడత 2027 నాటికి, రెండో విడత 2030 నాటికి ప్రారంభిస్తారు. ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ మధ్య దూరం మూడు నుంచి ఐదు కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ మేరకు నిర్మాణం చేస్తారు. ఆరు ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్లు వేస్తారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే హైదరాబాద్ నగరం మరింత విస్తరిస్తుంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేటజిల్లాల్లో మూసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ మండలాల మీదుగా రింగు రైల్ అలైన్‌మెంటు వెళ్తుంది. ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటేడ్ మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్క్‌గా పిలుస్తున్నారు.
భూసేకరణే సవాల్…
ప్రాంతీమ బాహ్య వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి సంబంధించి భూసేకరణే ప్రభుత్వాలకు అతిపెద్ద సవాల్. ఇప్పుడు దానికి అనుసంధానంగా రింగ్ రైల్ ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టి, ఒకేసారి భూ సేకరణ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. అందుకే త్రిబుల్ ఆర్‌కు సంబంధించిన భూ సేకరణను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు సమాచారం. అయితే భూమిని కోల్పోయే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు. ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షణలో చేపడుతున్న ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు పిలవగా, ఇంకా పలు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తికాకపోవడం గమనార్హం. భూములకు బదులు భూములివ్వాలనీ, లేనిపక్షంలో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు, భూయజమానులు డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ జారీచేసే నాటికి ఉన్న ధరల ప్రకారమే నష్టపరిహారం చెల్లించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ అంటున్నది. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపడతామని ప్రకటించినా, నిధుల కొరత నేపథ్యంలో వెనక్కి తగ్గింది. దక్షిణ భాగం కూడా కేంద్రమే చేపట్టాలంటూ రాష్ట్రం, కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసింది. దక్షిణ భాగం అలైన్‌మెంటులో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. గతంలో ఖరారుచేసిన అలైన్‌మెంటుకు మరో ఐదు కిలోమీటర్ల వరకు దూరం పెరిగింది. దీంతో సేకరించాల్సిన భూములు సైతం అధికం కానున్నాయి.
త్రిబుల్ ఆర్ టెండర్లు పిలిచారు
ఆర్‌ఆర్‌ఆర్‌ను 2017లో అప్పటి సర్కారు ప్రతిపాదిం చింది. ఇప్పటివరకు సంబంధిత నిర్మాణ సంబంధమైన ప్రక్రియ పూర్తికాలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించకపోవడంతో అప్పట్లో ఎన్‌హెచ్‌ఏఐ తేలిగ్గా తీసుకుంది. యుటిలిటీ చార్జీలు చెల్లించాలని కేంద్రం పెట్టిన షరతులకు బీఆర్‌ఎస్ సర్కారు ఒప్పుకోలేదు. దీంతో ప్రాజెక్టు పెండింగ్‌లో పడిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం 161.518 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకోసం రూ. 7104.06 కోట్లు ఖర్చవుతుంది. ఈ మేరకు ఇటీవల ఎన్‌హెచ్‌ఐఏ టెండర్లు పిలిచిందిే. ఐదు ఫ్యాకేజీలుగా నిర్మిస్తున్న ఉత్తర భాగంలో ఒక్కో ఫ్యాకేజీకి రూ. 1100 కోట్ల నుంచి రూ. 1700 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది.
భూసేకరణ ఇలా…
ఆర్‌ఆర్‌ఆర్‌కు మొత్తం 4 వేల ఎకరాలకు గాను సుమారు 3వేల ఎకరాలను సేకరించారు. మరో వెయ్యి ఎకరాలు అవసరం. త్రిబుల్ ఆర్‌కు 95 శాతం భూసేకరణ పూర్తయిందని ప్రభుత్వం చెప్తుంది. ఉత్తరభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉంది. అక్కడ ఇప్పుడు 2013 భూసేకణ చట్టాన్ని అమలుచేయాలనే డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తున్నది. మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు రూ. కోటి నుంచి రూ. రెండు కోట్ల వరకు ధర పలుకుతున్నది. కానీ, ఎన్‌హెచ్‌ఏఐ ఆ మేరకు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ససేమిరా అంటున్నది రాయగిరి, గజ్వేల్, సంగారెడ్డి, భువనగిరి తదితర ప్రాంతాల్లో న్యాయమైన పరిహారం కోసం రైతుల ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయమైన పరిహారం ఇవ్వకపోతే భూములివ్వబోమని రైతులు చెబుతున్నారు. కాగా భూసేకరణ నష్టపరిహారం కోసం మొత్తం రూ.5100 కోట్లు అవసరం కానున్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం బొప్పున భరించాల్సి ఉంటుంది. అయితే త్రిబుల్ ఆర్‌కు అనుసంధానంగా ఇప్పుడు రింగ్ రైల్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రతిపాదించడంతో భూసేకరణ మరింత ఎక్కువగా చేయాల్సి వస్తున్నది. ఒకేసారి రెండు ప్రాజెక్టులకు కలిపి భూసేకరణ చేస్తే అనేక సమస్యలకు ఒకేసారి పరిష్కారం లభిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనితో త్రిబుల్ ఆర్ భూసేకరణ ఆలస్యం అవుతోంది.
సవాళ్లు
ఇప్పటికే త్రిబుల్ ఆర్‌్‌కు సవాళ్లు పెరుగుతున్నాయి. తాజాగా రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా తోడవడంతో భూసేకరణ, పర్యావరణ అభ్యంతరాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అనేకం చుట్టుముడుతున్నాయి. నిర్ణీత కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ ఆలస్యమవుతూనే ఉంది. ఈ భాగాన్ని 2026 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రింగ్‌రైల్ వల్ల మరింత ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్‌హెచ్‌ఏఐ కొర్రీ
ఆర్‌ఆర్‌ఆర్‌కు సేకరిస్తున్న భూములకు సంబంధించి నష్ట పరిహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలనే ఒప్పందం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని పెంచే అవకాశం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ నష్ట పరిహారం పెంచాలని నిర్ణయిస్తే, ఆ మేరకు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి రావచ్చని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ నష్ట పరిహారం విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం ఇటీవలే జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. దీంతో రైతులు కోరుతున్న విధంగా నష్ట పరిహారాన్ని కలెక్టర్లు నిర్ధారించినప్పటికీ. ఆ మేరకు సగం భారం భరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పుకోవడంలేదు. గత జనవరికి ముందు ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సీఎంతోనూ భేటీ అయ్యారు. రైతులు, భూయజమానులకు ఉదారంగా పరిహారం చెల్లించాలని సీఎం సూచించిన విషయం విదితమే.