నవతెలంగాణ-హైదరాబాద్ : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తీవ్ర గాయం అయింది. మొదటి రోజు మూడో సెషన్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి కాలికి గాయం అయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పంత్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి ముందుగా బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి.. ఆపై పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దాంతో నొప్పితో విలవిల్లాడాడు. నొప్పి భరించలేక కాసేపు మైదానంలో పరుగెత్తాడు. ఆపై పంత్ తన షూ తీయగా.. రక్తం కారింది. బంతి తాకిన చోట వాపు కూడా వచ్చింది.
వెంటనే టీమిండియా ఫిజియో వచ్చి రిషబ్ పంత్‌కు చికిత్స చేశాడు. ఆ సమయంలో అతడు నొప్పితో విలవిల్లాడాడు. మైదానం నుంచి బయటికి తీసుకెళ్లే సమయంలో నడవలేని స్థితిలో ఉన్నాడు. దాంతో వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. వాహనంలో మైదానం వీడుతున్న సమయంలో కూడా తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. పంత్ గాయంకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాక.. రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. పంత్ గాయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈరోజు వికెట్స్ పడితే అతడు బ్యాటింగ్‌కు వస్తాడో లేదో చూడాలి.
రిషబ్ పంత్ మైదానాన్ని వీడిన కొద్ది సేపటికే సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం సాయి (61) పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో జడేజాకు శార్దూల్ ఠాకూర్ జతకలిశాడు. ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా మొదటి రోజును ముగించారు. 83 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఈ ఇద్దరు భారీ పరుగులు చేయాల్సి ఉంది.