– భద్రాచలం వద్ద 15.4 అడుగులు
– ధవళేశ్వరంలో 10.70 అడుగులు
రాజమండ్రి : గోదావరి ఎరుపెక్కింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు క్రమంగా వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 15.4 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి 98,609 క్యూసెక్కుల వరద కాటన్ బ్యారేజీకి చేరుతోంది. దీంతో 37 గేట్లు, ర్యాలి ఆర్మ్‌లో 20, మద్దూరు ఆర్మ్‌లో 11, విజ్జేశ్వరం ఆర్మ్‌లో 14 గేట్లను 0.40 మీటర్ల మీర పైకెత్తి 99,689 క్యూసెక్కుల అదనపు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.70 అడుగులు నమోదైంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి అదనంగా వస్తున్న 1,68,729 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. 902 హిల్ ప్రాంతం నుండి స్పిల్ ఛానల్ మీదుగా దిగువ కాఫర్ డ్యామ్‌కు వేసిన రోడ్డు మార్గం పూర్తిగా నీటమునగడంతో లారీలు స్పిల్‌వే మీదుగా ప్రయాణిస్తున్నాయి.
ప్రాజెక్ట్ దిగువన ఆరు మీటర్ల నీటిమట్టం నమోదైందని, ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. పోలవరం నిర్వాసిత మండలాల్లోని గోదావరి, శబరి నదుల ప్రవాహాలు క్రమేపీ పెరుగుతున్నాయి. వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు అధికారులు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వరద పెరుగుతుండడంతో కూనవరం, విఆర్.పురం, ఎటపాక, చింతూరు మండలాల వాసుల్లో భయాందోళన నెలకొంది. దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలోకి భారీగా వరద నీరు ప్రవేశించడంతో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థాన ఇఒ ప్రకటించారు.
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- Advertisement -
- Advertisement -