Tuesday, July 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిభారత్‌లో పెరుగుతున్న ఆదాయ అసమానతలు

భారత్‌లో పెరుగుతున్న ఆదాయ అసమానతలు

- Advertisement -

అరవై ఒక్క దేశాలకు సంబంధించి ఆ దేశాల్లో ప్రజానీకం చేసే ఖర్చుల తీరు తెన్నులను, కొన్ని దేశాలలో ఆదాయాల తీరు తెన్నులను తెలియజెప్పే గణాంకాలను ఇటీవల ప్రపంచబ్యాంక్‌ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం అంతరాలు అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం 2022లో నాలుగో స్థానంలో ఉంది. దానిని పట్టుకుని మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే సమన్యాయం అమలు జరుగుతున్న దేశాల్లో మన దేశం నాలుగో స్థానంలో ఉందంటూ ప్రచారం మొదలెట్టారు. ఈ విధమైన గొప్పలకు పోవడం అత్యంత హాస్యాస్పదమని పరిశోధకులు ఇప్పటికే ఎండగట్టారు. దానిమీద మరింత సమయాన్ని వెచ్చించడం అంటే చచ్చిన పాముని ఇంకా చంపడమే. అయితే ఒకటి, రెండు వివరించాల్సిన అంశాలున్నాయి. ఈ లేని గొప్పల గురించిన చర్చ కన్నా, అసలు దేశ ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా ఇప్పుడు ఏం జరుగుతోందో తెలియాలి. దానికన్నా ముందు మోడీ ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలెంత అర్థం పర్థం లేనివో తెలియజెప్పిన వాదనలను సంక్షిప్తంగా చూద్దాం. 61 దేశాల సమాచారం మాత్రమే పట్టుకుని మొత్తం ప్రపంచం అంతా ఇదేనన్నట్టు మాట్లాడడంలో అర్థం లేదన్నది కనిపిస్తూనేవుంది. రెండవది: ఖర్చు చేసే దానిలో అంతరాల కన్నా ఆదాయాల్లో అంతరాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పెరుగుతున్నకొద్దీ, వినిమయం కోసం చేసే ఖర్చు శాతం తగ్గుతూ, పొదుపు చేసే శాతం పెరుగుతూ పోతుంది. అందుచేత ఏ దేశానికైనా ఖర్చు చేసే దానిలో అంతరాలు తక్కువగా ఉంటాయి. ఆదాయాల్లో అంతరాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు వివిధ దేశాలలో నెలకొన్న అసమానతలను అంచనా కట్టేటప్పుడు కొన్ని సార్లు ఆదాయాల అంతరాలను, మరికొన్నిసార్లు ఖర్చుల్లో అంతరాలను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదు. దాని ప్రాతిపదికన ఎటువంటి నిర్ధారణకూ రావడానికి వీలులేదు.

ఇక్కడ ఇంకో అంశాన్ని పేర్కొనాలి. ఆదాయాల్లో కనిష్ట స్థాయిలో ఉన్నవారి విషయంలో వారివద్ద పొదుపు చేసేది ఏమీ ఉండదు. నిల్వ ఉండకపోగా కనీస స్థాయిలో తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులకోసం వారు అప్పులు చేస్తారు. మరీ ముఖ్యంగా వైద్య అవసరాలు వచ్చినప్పుడు ఇది అనివార్యం. అందుచేత కేవలం చేసిన ఖర్చుల ప్రాతిపదికన అసమానతలను అంచనా వేయడం వల్ల తప్పుడు నిర్థారణలు వస్తాయి. అట్టడుగుస్థాయిలో ఉండే ప్రజలు రుణ భారంతో ఇబ్బంది పడుతూంటారన్నది జగమెరిగిన సత్యం. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం వ్యవసాయదారుల రుణ విముక్తి చట్టాన్ని 2006లో తెచ్చింది. రైతాంగ ఆత్మహత్యలను నివారించడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఆ సందర్భంగా ఎక్కువమంది రైతుల ఆత్మహత్యలకు కారణం వారు వైద్య అవసరాల నిమిత్తం చేసిన అప్పులేనని పరిశీలనలో వెల్లడైంది. (దానిని పట్టుకుని కొందరు వ్యవసాయ అవసరాల కోసం అప్పులు చేసినవారికే రుణ విముక్తి వర్తించేలా చట్టాన్ని సవరించాలంటూ వాదించారు కూడా. మరొక అంశం: అత్యున్నత ఆదాయ వర్గాల మొత్తం సంఖ్యకు తగ్గ నిష్పత్తిలో సర్వే నిమిత్తం ఎంచుకున్న వారిలో వారు ఉండరు. ఇది అన్ని సర్వేల్లోనూ కనిపించేదే. దానికి కారణం వారు సంఖ్య రీత్యా చాలా తక్కువ. మామూలుగా పరిశోధకులు ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ లోపాన్ని సరి చేయడానికి పలు పద్ధతులను అవలంభిస్తారు. కానీ ఈ సర్వేలో అటువంటి ప్రయత్నాలేవీ జరగలేదు. ప్రపంచబ్యాంకు జాతీయ శాంపిల్‌ సర్వే ఇచ్చిన సమాచారం ఆధారంగా తన నివేదిక రూపొందించింది. అందులో పైన పేర్కొన్న లోపాన్ని సవరించే ప్రయత్నమేదీ జరగలేదు. తక్కిన దేశాల విషయంలో కూడా ఇదే మాదిరిగా జరిగింది.

ప్రపంచ బ్యాంకు వినిమయ ఖర్చుల అంతరాలను అంచనా వేసినప్పుడు సంపద పంపిణీని మొత్తంగా అంచనా వేస్తుంది. దాని కారణంగా కూడా పొరపాటు నిర్ధారణలకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు : సంపన్నులలో అత్యంత సంపన్నులైన ఒక శాతం వ్యక్తుల ఆదాయాల వాటా పెరిగిందనుకుందాం. అదే సమయంలో వారికి దిగువన ఉన్న వారిలో (దిగువ నుండి) 5వ దొంతరలో ఉన్నవారి ఆదాయాలు తగ్గి వారంతా (దిగువనుండి) 3వ దొంతరలోకి దిగజారిపోయారనుకుందాం. అప్పుడు అంతరాల సూచిక అంతరాలు తగ్గినట్టు చూపిస్తుంది. నిజానికి తక్కిన తరగతులన్నీ నష్టపోయినందునే ఆ ఒక్క శాతమూ తమ సంపదను మరింత పెంచుకోగలిగారు. కాని అంతరాల సూచిక దానిని సక్రమంగా సూచించజాలదు. ఈ అంతరాల సూచికను బట్టి ఆర్థిక అసమానతలు తగ్గిపోయాయనో, పెరిగిపోయాయనో నిర్ధారించడం అర్థరహితం. ఒకవేళ మన దేశంలో వాస్తవంగానే ధనిక, పేద అంతరాలు తగ్గిపోయివుంటే, ఆకలి, పౌష్టికాహార లోపం చాలా తీవ్ర స్థాయిలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నట్టు? దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? తక్కిన ప్రధాన దేశాలన్నింటికన్నా మన జీడీపీ వృద్ధిరేటు చాలా ఎక్కువగా కొనసాగుతున్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇప్పుడు అసమానతలు కూడా తగ్గిపోయాయని అంటున్నది వాస్తవమే అయితే, అత్యల్ప ఆదాయాలు పొందేవారికి కూడా ఆదాయాల్లో పెరుగుదల ఎంతో కొంత ఉండాలి కదా. అప్పుడు ఆహార ధాన్యాల వినియోగంలో మన దేశం ప్రపంచంలోని 125 దేశాలతో పోల్చినప్పుడు 107వ స్థానంలోనే ఎందుకు ఉన్నట్టు? ఎందుకు భారతీయ మహిళలలో రక్తహీనత పెరుగుతున్నట్టు? కనీస స్థాయిలో పౌష్టికాహారాన్ని పొందలేకపోతున్న జనాభా శాతం ఎందుకు పెరుగుతున్నట్టు? జీడీపీ వృద్ధిరేటు పెరుగుతున్నందువల్ల పెరిగిన సంపదనంతటినీ అత్యంత సంపన్నవర్గాలు చేజిక్కించుకుంటున్నందువల్లే ఇలా జరుగు తోంది. దీనిని ప్రపంచబ్యాంకు తయారు చేసిన అంతరాల సూచిక వెల్లడించలేదు. ప్రపంచ బ్యాంక్‌ అంతరాల సూచికకు ప్రత్యామ్నా యంగా థామస్‌ పికెటీ, అతని బృందం ప్రపంచ అసమానతల సూచికను తయారు చేయడానికి గణాంకాలను సేకరించారు. వారి నివేదిక ప్రకారం భారతదేశంలో 2023-24లో అత్యంత సంపన్నులైన 1 శాతం దగ్గర దేశ ఆదాయంలో ఏకంగా 23 శాతం చేరింది. ఇది గత వంద సంవత్సరాల్లోకెల్లా అత్యధికం. నయా ఉదార వాద విధానాలను అమలు చేస్తున్న ఫలితంగా అత్యవసర సేవలైన వైద్యం, విద్య వంటివి అంతకంతకూ అధికంగా ప్రైవేటు రంగం చేతుల్లోకి పోతున్నాయి. ఆదాయాల అంతరా లు పెరిగిపోవడంలో దీని పాత్ర చాలా ఉంది.

సంపన్నులు ఎప్పుడూ ఖరీదైన ప్రయివేటు వైద్యానికే పోతూంటారు. పేదవారు ప్రభుత్వ వైద్య సంస్థల సేవలను ఉపయోగించు కుంటారు. ఎప్పుడైతే ప్రభుత్వ వైద్య వ్యవస్థ కుదించుకుపోతూవుంటుందో, అప్పుడు ఆ పేదవారు సైతం అనివార్యంగా ప్రయివేటు వైద్య సేవల వైపు మళ్ళవలసివస్తుంది. దాని వల్ల వారి ఖర్చు పెరుగుతుంది. ఒకపక్క ఆదాయాలు తగ్గిపోతున్నా, మరొకవైపు ఖర్చు పెరుగుతుంది. ఈ పెరిగిన ఖర్చును చూపించి ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నట్టు చెప్పుకోవడం కన్నా అసంబద్ధమైనది ఉంటుందా? ఇలా వైద్యం నిమిత్తం ఖర్చు పెరిగిపోయినప్పుడు పేదలు అనివార్యంగా ఇతర ఖర్చులను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తారు. అందువల్లే వారి ఆహార ఖర్చు తగ్గుతుంది. అది కాకపోతే వారు అప్పులు చేస్తారు. అందుచేత అంతరాలు తగ్గిపోయాయంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నది వాస్తవ చిత్రానికి పూర్తి విరుద్ధం. ప్రభుత్వ ఆస్పత్రులలో విపరీతమైన రద్దీ కారణంగా సకాలంలో వైద్యం అందకపోవడం, లేదా, అక్కడ ఆలస్యం అవుతున్నందున ప్రయివేటు ఆస్పత్రులకు పోయి అక్కడ బిల్లులు కట్టలేక, వైద్యం పొందలేక బిడ్డల్ని పోగొట్టుకోవడం వంటి సంఘటనలతో వార్తాపత్రికల్లో మనకు ప్రతీరోజూ కనిపిస్తూనే వున్నాయి.

ప్రజలకు అత్యవసరమైన సేవలను ప్రయివేటుపరం చేసి వాటిని ఖరీదైనవిగా మార్చి, పేదలను మరింత కష్టాలపాలు చేయడమే కాకుండా, తమ విధానాల వల్ల సమాజంలో ధనిక, పేద అంతరాలు తగ్గిపోయాయంటూ ప్రచారం చేసుకోవడం ఈ ప్రభుత్వపు బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -