ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలపై ప్రభావం
ఇంధన వ్యవస్థలో భారీ సంక్షోభమే కారణం
‘హార్ముజ్’ మూసివేతతో దెబ్బతిన్న చమురు, గ్యాస్ సరఫరా
యుద్ధం ఇలాగే కొనసాగితే కష్టమే
అది ప్రపంచ ఆహార సరఫరాను దెబ్బ తీస్తుంది
విశ్లేషకులు, నిపుణుల హెచ్చరికలు
వాషింగ్టన్, టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థను తీవ్రంగా కుదిపేసింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో సుమారు 20 శాతం వరకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా అనేక దేశాలు తమ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీని ప్రభావం సాధారణ ప్రజలపై అధికంగా ఉంటోందని వివరిస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే అది ప్రపంచ ఆహార సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యలు
ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు 400 మిలియన్ బ్యారెల్స్ చమురు కొరత ఏర్పడింది. దీంతో చమురు ధరలు 50 శాతం వరకు పెరిగి.. బ్యారెల్‌కు 110 డాలర్లు దాటాయి. మధ్యప్రాచ్య చమురు ధరలు మరింతగా పెరిగి 160 డాలర్లకు చేరాయి. ఈ ధరల పెరుగుదల వల్ల.. రవాణా ఖర్చులు పెరిగాయి. విమాన టిక్కెట్లు ఖరీదయ్యాయి. విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు విదేశీ పర్యటనలను నిలిపివేయడం, కొన్ని చోట్ల విద్యాసంస్థలను మూసివేయడం వంటి చర్యలు అమలు చేస్తున్నాయి.
రువుల ధరలు పెరుగుదల.. ఆహార భద్రతపై ప్రభావం
ఇంధన సంక్షోభం మాత్రమే కాకుండా ఈ యుద్ధం ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో సుమారు మూడో వంతు హార్ముజ్ మార్గం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఆ సరఫరా నిలిచిపోవడంతో యూరియా వంటి ఎరువుల ధరలు 30 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగాయి. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ధాన్యాలు, పాలు, మాంసం ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. భారత్, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాల్లో ఎరువుల ఫ్యాక్టరీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా నిలిపివేయడం ఇప్పటికే ప్రారంభించాయి. ఈ యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే ప్రపంచ ఆహార సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చరిత్రలోనే అతిపెద్ద అంతరాయం
అమెరికా-ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ యుద్ధం ప్రభావంగా హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు, గ్యాస్ రవాణా దాదాపు నిలిచిపోయింది. ఇది ప్రపంచం మొత్తం సరఫరాలో 20 శాతం. ఈ పరిస్థితి కారణంగా ప్రపంచ ఇంధన రంగంలో ఇది చరిత్రలోనే అతిపెద్ద అంతరాయంగా భావిస్తున్నారు. 1973 అరబ్ ఆయిల్ సంక్షోభం కంటే కూడా ఇది తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.



