చర్చలంటూనే అమెరికా, ఇజ్రాయిల్ దాడులు
రెండు దేశాలకూ ఇరాన్ గట్టి సమాధానం
గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై స్ట్రైక్స్
హార్ముజ్‌లో పాకిస్తాన్ జెండాతో అమెరికాకు చమురు ట్యాంకర్
క్షిపణులతో దాడి చేసిన ఐఆర్‌జీసీ
మరో పదిరోజులు యుద్ధానికి విరామం : ట్రంప్ ప్రకటన
ఇజ్రాయిల్ సైన్యం కుప్పకూలే ప్రమాదం : ఐడీఎఫ్ చీఫ్ హెచ్చరిక
వాషింగ్టన్,టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు, హెచ్చరికలను ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయట్లేదు. ప్రతిదాడులతో గట్టి సమాధానం చెప్తోంది. టెహ్రాన్‌లో బాలిస్టిక్ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. పశ్చిమ ఇరాన్‌లో క్షిపణి ప్రయోగ, నిల్వ కేంద్రాలపై కూడా దాడులు చేశామని ప్రకటించింది. ఇక ఇరాన్.. యూఎస్ మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది.శుక్రవారం కూడా ఈ దాడులను కొనసాగించింది. బహ్రైయిన్, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై క్షిపణుల్ని ప్రయోగించింది. మరోవైపు పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
అవి అమెరికాకు ఇచ్చిన కానుకలు:ట్రంప్
ఇరాన్ తన ఇంధన కేంద్రాలు, చమురు నిల్వలపై దాడులను తప్పించుకోవాలంటే చర్చలు ఒక్కటే మార్గమని చెప్పారు. లేకుంటే వారి ఇంధన కేంద్రాలను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ”హార్ముజ్ జలసంధి నుంచి ఎనిమిది చమురు నౌకలను వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఇది అమెరికాకు ఇరాన్ ఇచ్చిన ‘కానుక’ అని చెప్పుకొచ్చారు.
ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ
అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ రెండు దేశాలవి ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదమని అభివర్ణించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి ఇరాన్ ఓ లేఖ రాసింది. తమ దేశ సీనియర్ ఉన్నతాధికారులు, విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగెర్ ఘాలిబాఫ్‌లను హత్య చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర పన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖను ఐక్యరాజ్యసమితి (యూఎన్) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, యూఎన్ భద్రతా మండలి అధ్యక్షుడికి యూఎన్‌లోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయ్యిద్ ఇరావని గురువారం అందించారు. ఈ వివరాలతో ఇరాన్ అధికారిక న్యూస్ ఛానల్ ఒకటి వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. అమెరికా, ఇజ్రాయిల్‌లు ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యలకు పాల్పడుతున్నాయని వివరించింది.
ఈ విధంగా కుట్రలు చేయడం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఇరాన్ హై ర్యాంకింగ్ అధికారులపై దాడులు జరిగితే, అది శాంతియుత అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. అరబ్ దేశాల తీరుపై కూడా ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా సైన్యానికి సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సహకారాన్ని అందించడం విచారకరమని పేర్కొంది. ఈ అరబ్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తున్నాయని వివరించింది. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు అమెరికాకు సైనికపరమైన ఆశ్రయం ఇవ్వడాన్ని ఆపాలని సూచించింది.
ఇరాన్‌పై యూఎస్ రహస్య ఆయుధం
గల్ఫ్ సముద్ర మార్గాల్లో పహారా కోసం తొలిసారిగా మానవరహిత డ్రోన్ స్పీడ్‌బోట్లను మోహరించినట్టు పెంటగాన్ అధికారికంగా ధృవీకరించింది. ఇరాన్ కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు సముద్ర జలాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయటమే లక్ష్యమని పేర్కొంది. అత్యంత వేగంగా ప్రయాణించే ఈ స్పీడ్‌బోట్‌లు శత్రువుల కదలికలను సులువుగా పసిగడతాయని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. గతంలో ఉక్రెయిన్ కూడా ఈ తరహా బోట్లనే వాడి రష్యాపై దాడులు చేసింది.
ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరించి ఇరాన్‌ను దెబ్బతీసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తుంది. అయితే డ్రోన్ బోట్లలో అనేక వైఫల్యాలు ఉన్నట్టు సమాచారం. వీటిని అమెరికా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదు. గతేడాది జరిగిన పరీక్షల్లో ఓ జీఏఆర్‌సీ బోట్ వేగంగా వెళ్లి మరో బోట్‌ను ఢకొీట్టింది. తాజాగా మిడిల్ ఈస్ట్‌లో జరిగిన మరో పరీక్షలో ఓ డ్రోన్ స్పీడ్‌బోట్ పనిచేయకుండా పోయింది. అనేక సాంకేతిక లోపాలు ఈ బోట్లలో ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.
పెరుగుతున్న మృతులు
పశ్చిమాసియా ఘర్షణల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటి వరకు 1900 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. లెబనాన్‌లో 1,100 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 18 మంది, లెబనాన్‌లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు అలాగే అమెరికా బలగాలకు చెందిన 13 మందితో పాటు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో నలుగురు, గల్ఫ్ అరబ్ రాష్ట్రాల్లో 20 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
దాడులు మరింత తీవ్రం : ఇజ్రాయిల్
ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ హెచ్చరించారు. తాము పదే పదే చెప్తున్నా, ఇరాన్ తన దాడులు కొనసాగిస్తున్నదనీ, దాన్ని ఉపేక్షించబోమని చెప్పారు. మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామనీ, దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పాకిస్తాన్ జెండాతో అమెరికాకు ఆయిల్
హార్ముజ్ జలసంధిలో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్‌పై శుక్రవారం ‘ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)’ క్షిపణులతో దాడిచేసి ధ్వంసం చేసింది. ఈ ట్యాంకర్‌పై పాకిస్తాన్ జెండా ఉంది. ఆ పేరుతో చమురును అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్టు ఐఆర్‌జీసీ కథనాలు తెలిపాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకుని పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో సిబ్బంది ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.
మరో పది రోజులు దాడులు నిలిపివేత : ట్రంప్
ఇరాన్ దాడులకు భీతిల్లుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇరాన్ అభ్యర్థన మేరకు మరో పదిరోజులు దాడుల్ని నిలుపుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ వేదికగా ”ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులకు సంబంధించిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నాను. వాళ్లు వారంరోజులు గడువు కోరారు. నేనే పది రోజులు గడువిచ్చా.
ఇరాన్ ప్రతినిధులతో జరుగుతున్న చర్చలు అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి” అని రాసుకొచ్చారు. మరోవైపు యథాప్రకారం అమెరికా మీడియాపై ఆయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇరాన్‌తో చర్చలు విఫలమవుతున్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ అవన్నీ ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేశారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ట్రంప్ తన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 6 వరకు ఇరాన్ ఎనర్జీ గ్రిడ్‌లపై ఎటువంటి బాంబు దాడులు చేయకూడదని చెప్పారు.
ట్రంప్‌పై అమెరికన్ల అసంతృప్తి..ఆ దేశంలోపెరిగిన జీవన వ్యయం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆదేశంలో ప్రజావ్యతిరేకత తీవ్రమవుతున్నది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రజల జీవన వ్యయం పెరిగింది. ఈ మేరకు అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే నవంబర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని ఆ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఈ భయం ఇప్పుడు రిపబ్లికన్లను వెంటాడుతుంది.
ఇజ్రాయిల్ సైన్యం కుప్పకూలే ప్రమాదం: ఐడీఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్
”హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ దళాలతో ఏకకాలంలో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యం, ప్రస్తుతం తీవ్రమైన ‘మానవ వనరుల కొరత’ ఎదుర్కొంటోంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ సైన్యం కుప్పకూలే ప్రమాదం ఉంది.” అని ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ అయాల్ జమీర్ హెచ్చరించారు.
ఇటీవల జరిగిన భద్రతా క్యాబినెట్ సమావేశంలో జమీర్ ఈ కీలక విషయాలపై మాట్లాడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పెరుగుతున్న కార్యచరణ ఒత్తిళ్లను ఆయన వివరించారు. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందు 10 ప్రదిపాదనలు ఉంచారు. అందులో ప్రస్తుత పరిస్థితి తీవ్రతను ఆయన వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సైన్యం తన రోజువారీ సాధారణ మిషన్లను కూడా పూర్తి చేయలేని రోజు ఎంతో దూరంలో లేదని ఘాటుగానే హెచ్చరించినట్టు తెలిసింది.
చర్చలే పరిష్కారం : చైనా
హార్ముజ్ జలసంధి పునరుద్ధరణకు చర్చలు దోహదం చేస్తాయని చైనా వెల్లడించింది. అయితే అవి అంత సులువు కాకున్నా, హార్ముజ్ మీదుగా సాధారణ నౌకాయానాన్ని పునరుద్ధరించేందుకు అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడుతూ చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాకిస్తాన్‌కు చైనా మద్దతు తెలిపింది.



