Tuesday, October 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలురియాజ్ ఎన్‌కౌంటర్... మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన

రియాజ్ ఎన్‌కౌంటర్… మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రియాజ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన ఘటన వివాదాస్పదంగా మారింది. పోలీసులు ఇది ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పులని చెబుతుండగా, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తూ తెలంగాణ మానవ హక్కుల వేదిక తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మానవ హక్కుల వేదిక ఒక ప్రకటన విడుదల చేసింది. “రియాజ్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి, వారిపై హత్య కేసు నమోదు చేయాలి. ఈ ఘటనను హైకోర్టు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి” అని ఆ ప్రకటనలో కోరింది.

రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, తాను ఉన్న గది అద్దాలను పగలగొట్టాడని తెలిపారు. ఆ శబ్దం విని తనిఖీ కోసం వెళ్లిన పోలీసుల నుంచి రియాజ్ తుపాకీ లాక్కొని, వారిపైనే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడని వివరించారు. ఈ క్రమంలో, ఆత్మరక్షణ కోసం ఆర్ఐ (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్) గత్యంతరం లేక రియాజ్‌పై కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ కాల్పుల్లో అతను మరణించాడని సీపీ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -