Sunday, April 5, 2026
E-PAPER
Homeఆటలురిజ్వీ రప్పా రప్పా

రిజ్వీ రప్పా రప్పా

- Advertisement -

– ఛేదనలో సమీర్‌ రిజ్వీ చెడుగుడు
– ముంబయిపై ఢిల్లీ ఘన విజయం

ముంబయి ఇండియన్స్‌పై సమీర్‌ రిజ్వీ సునామీ. బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన పిచ్‌పై నాణ్యమైన బౌలింగ్‌తో ముంబయి ఇండియన్స్‌ గెలుపుపై కన్నేసినా.. సమీర్‌ రిజ్వీ రప్పా రప్పా ఇన్నింగ్స్‌తో ఊచకోత కోశాడు. ఓ దశలో 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ ఏడు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 51 బంతుల్లోనే 90 పరుగులు పిండుకున్నాడు. సమీర్‌ రిజ్వీ రప్పా రప్పా జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్‌19లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండో విజయం.

నవతెలంగాణ-ఢిల్లీ:
ఐపీఎల్‌19లో సమీర్‌ రిజ్వీ దండయాత్ర కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ గాలివాటం కాదంటూ.. శనివారం ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ముంబయి ఇండియన్స్‌పై దండెత్తాడు. 7 సిక్స్‌లు, 7 ఫోర్లతో రిజ్వీ విశ్వరూపం చూపించాడు. సమీర్‌ రిజ్వీ (90, 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు)కు జతగా పతుమ్‌ నిశాంక (44, 30 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.1 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (51, 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరువగా.. రోహిత్‌ శర్మ (35, 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), నమన్‌ దిర్‌ (28, 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఛేదనలో దంచికొట్టిన సమీర్‌ రిజ్వీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్‌కు ఇది తొలి ఓటమి కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన రెండింట విజయాలు నమోదు చేసింది.

సమీర్‌ రిజ్వీ సూపర్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం 163 పరుగులు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించటం లేదు. ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (1), నితీశ్‌ రానా (0) వరుస ఓవర్లలో వికెట్‌ పారేసుకున్నారు. ఈ దశలో మరో ఓపెనర్‌ పథుమ్‌ నిశాంక (44), సమీర్‌ రిజ్వీ (90) క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పవర్‌ప్లేలోనే క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. ఆచితూచి ఆడాడు. నిశాంక దూకుడుగా ఆడటంతో రిజ్వీ స్ట్రయిక్‌రొటేషన్‌ చేశాడు. 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 బంతుల్లో 44 పరుగులు చేసిన నిశాంక అర్థ సెంచరీకి చేరువ కాగా.. శాంట్నర్‌ మాయాజాలం చేశాడు. దీంతో పది ఓవర్లలో క్యాపిటల్స్‌ 73/3తో నిలిచింది.
అప్పటివరకు 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ.. 11వ ఓవర్‌ నుంచి ఊచకోత మొదలెట్టాడు. కార్బిన్‌ బాష్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నాడు. మయాంక్‌ మార్కండె ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీపక్‌ చాహర్‌ ఓవర్లో ఓ సిక్సర్‌, ఫోర్‌తో దంచికొట్టాడు. శార్దుల్‌ ఠాకూర్‌ ఓవర్లోనూ బౌండరీలు బాదాడు. ఒక్కసారిగా విరుచుకుపడిన రిజ్వీ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 31 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. రిజ్వీ దూకుడుతో లక్ష్యం చిన్నదైపోయింది. నిశాంకతో మూడో వికెట్‌కు 49 బంతుల్లో 66 పరుగులు జోడించిన రిజ్వీ.. నాల్గో వికెట్‌కు డెవిడ్‌ మిల్లర్‌తో కలిసి 39 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇందులో రిజ్వీ 65 పరుగులు చేయగా, మిల్లర్‌ 11 పరుగులే జతచేశాడు. శతకం ముంగిట రిజ్వీ నిష్క్రమించినా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (3 నాటౌట్‌)తో కలిసి డెవిడ్‌ మిల్లర్‌ (21 నాటౌట్‌, 18 బంతుల్లో 4 ఫోర్లు) లాంఛనం ముగించాడు. మరో 11 బంతులు ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో దీపక్‌ చాహర్‌ (1/20), మిచెల్‌ శాంట్నర్‌ (1/22), కార్బిన్‌ బాష్‌ (1/39) వికెట్లు పడగొట్టారు.

రాణించిన సూర్యకుమార్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబయి ఇండియన్స్‌ బ్యాట్‌తో తడబాటుకు గురైంది. పిచ్‌ బౌలర్లకు అనుకూలించగా స్కోరు బోర్డు వేగంగా కదల్లేదు. ఓపెనర్‌ రియాన్‌ రికెల్టన్‌ (9), తిలక్‌ వర్మ (0) పవర్‌ప్లేలోనే నిష్క్రమించారు. రోహిత్‌ శర్మ (35, 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (51) ముంబయి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 40 బంతుల్లో 53 పరుగులు చేసింది. 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. డెత్‌ ఓవర్లలో ఎదురుదాడి చేయాలని భావించాడు. కానీ ఎంగిడి ఓవర్లో ఎల్బీగా నిష్క్రమించాడు. రూథర్‌ఫోర్డ్‌ (5) నిరాశపరిచాడు. ఆఖర్లో నమన్‌ దిర్‌ (28), మిచెల్‌ శాంట్నర్‌ (18 నాటౌట్‌), కార్బిన్‌ బాచ్‌ (11 నాటౌట్‌) ముంబయి ఇండియన్స్‌కు మెరుగైన స్కోరు అందించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (2/26), లుంగిని ఎంగిడి (1/34), అక్షర్‌ పటేల్‌ (1/22), విప్‌రాజ్‌ నిగమ్‌ (1/24), నటరాజన్‌ (1/24) రాణించారు.

స్కోరు వివరాలు
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ : రికెల్టన్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 9, రోహిత్‌ శర్మ (సి) నితీశ్‌ (బి) అక్షర్‌ 35, తిలక్‌ వర్మ (సి,బి) ముకేశ్‌ 0, సూర్యకుమార్‌ యాదవ్‌ (ఎల్బీ) ఎంగిడి 51, రూథర్‌ఫోర్డ్‌ (సి) ముకేశ్‌ (బి) విప్‌రాజ్‌ 5, నమన్‌ (సి) స్టబ్స్‌ (బి) నటరాజన్‌ 28, శాంట్నర్‌ నాటౌట్‌ 18, బాష్‌ నాటౌట్‌ 11, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-18, 2-18, 3-71, 4-85, 5-122, 6-146.
బౌలింగ్‌ : ముకేశ్‌ కుమార్‌ 3-0-26-2, లుంగి ఎంగిడి 4-0-34-1, అక్షర్‌ పటేల్‌ 4-0-22-1, విప్‌రాజ్‌ నిగమ్‌ 3-0-24-1, కుల్‌దీప్‌ యాదవ్‌ 3-0-31-0, నటరాజన్‌ 3-0-24-1.
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ : కెఎల్‌ రాహుల్‌ (సి) రికెల్టన్‌ (బి) చాహర్‌ 1, నిశాంక (సి) మార్కండె (బి) శాంట్నర్‌ 44, నితీశ్‌ రానా (రనౌట్‌) 0, సమీర్‌ రిజ్వీ (సి) తిలక్‌ (బి) బాష్‌ 90, డెవిడ్‌ మిల్లర్‌ నాటౌట్‌ 21, ట్రిస్టన్‌ స్టబ్స్‌ నాటౌట్‌ 3, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 164.
వికెట్ల పతనం : 1-2, 2-7, 3-73, 4-151.
బౌలింగ్‌ : దీపక్‌ చాహర్‌ 3-0-20-1, జశ్‌ప్రీత్‌ బుమ్రా 4-0-21-0, మిచెల్‌ శాంట్నర్‌ 3-0-22-1, శార్దుల్‌ ఠాకూర్‌ 3-0-41-0, మయాంక్‌ మార్కండె 2-0-20-0, కార్బిన్‌ బాష్‌ 3.1-0-39-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -