Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదాలను నిలువరించాలి

రోడ్డు ప్రమాదాలను నిలువరించాలి

- Advertisement -

– డివైడర్‌ లేకే చేవెళ్ల ఘటన
– వాహనాల స్పీడ్‌పై పర్యవేక్షణ ఉండాలి : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ, రవాణా శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్‌ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డుతోపాటు డివైడర్‌ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. సోమవారం రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ వికాస్‌రాజ్‌, రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, జేటీసిలు, డీటీసీలు, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాహనాల స్పీడ్‌ లాక్‌ అమలవుతోందా అని అధికారులను ప్రశ్నించారు. ఆ నిబంధనను ఉల్లంఘిస్తే ట్రిపుల్‌ పెనాల్టీ వేయాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంటు సీరియేస్‌గా, చురుగ్గా ఉండాలని చెప్పారు. ఘటన జరిగినప్పుడు మాత్రమే దాడులు చేయడం కాదనీ, నిరంతరం యాక్షన్‌ ప్లాన్‌ ఉండేలా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని సూచించారు. అందరూ ప్రభావితులయ్యేలా కార్యాచరణ ఉండాలనీ, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణా శాఖ అధికారులు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను నిలువరిచ్చవని అభిప్రాయపడ్డారు. ప్రజలకు వేధింపులు లేకుండా రవాణా శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని చెప్పారు. రవాణాశాఖలో కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని వివరించారు. టిప్పర్‌ లారీలు ఇసుక, డస్ట్‌ తీసుకెళ్లేటప్పుడు టార్పాలిన్‌ కప్పుకొని తీసుకుపోవాలని ఆదేశించారు. డీటీసీ, ఆర్టీవోలు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బందాలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధాన్యం తరలింపుకు ఉపయోగించే వాహనాలను వేధించొద్దని స్పష్టం చేశారు. వాణిజ్య వాహనాలు , ప్రయాణికులను తరలించే వాహనాలు , మైన్స్‌, మినరల్స్‌ తరలించే వాహనాల్లో నిబంధనలు పాటించాలని చెప్పారు. వాహనాల్లో భారీ పెనాల్టీతోపాటు కఠినచర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించని స్లీపర్‌ బస్సుల్లో కార్గో సరుకులు తరలించిన కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. స్కూల్‌ బస్‌ ఫిట్నెస్‌ , హైర్‌ బస్‌ ఫిట్నెస్‌ , ట్రక్కులు , టిప్పర్‌ లారీలు వాటి ఫిట్నెస్‌ ఫర్మిట్‌లపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే రోడ్‌ భద్రత మాసోత్సవంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -