– ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ అనిల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్లూర్ గ్రామంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమ్మర్‌పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎస్ఐ జి.అనిల్ రెడ్డి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ తప్పనిసరి వాడకం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.
గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకొని, ప్రమాదాల తీవ్రతను ప్రజలకు వివరించారు. సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించవచ్చో తెలియజేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు బేసిక్ లైఫ్ సపోర్ట్ (బిఎల్ఎస్) పద్ధతులపై అవగాహన కల్పించారు.గ్రామ ప్రజలందరినీ రోడ్డు భద్రత బాధ్యతల్లో భాగస్వాములను చేసి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 108 అంబులెన్స్ సిబ్బంది కూడా హాజరై, అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన చర్యలపై ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. అనంతరం ఎస్ఐ జి.అనిల్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కువరి శేఖర్, వార్డు సభ్యులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



