– టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం
– ఏసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు
– త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం : తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి
– మిర్జాగూడ ప్రమాద స్థలం పరిశీలన
– సీఐతోపాటు క్షతగాత్రులకు పీఎంఆర్ ఆస్పత్రిలో పరామర్శ
నవతెలంగాణ-చేవెళ్ల
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. మంగళవారం రంగారెడ్డి చేవెళ్ల మండలం మిర్జాగూడలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని డీజీపీ సందర్శించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాద స్థలంలో మూల మలుపులు, గుంతలు, ఇతర కారణాలను పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే సమయంలో గాయపడిన చేవెళ్ల సీఐతోపాటు పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులనూ డీజీపీ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. టిప్పర్ అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢ కొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. దాదాపు 40 మీటర్లు లాక్కెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులో డ్రైవర్ సైడ్ కూర్చున్న వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రోడ్డు మలుపు ఉంది కానీ యాక్సిడెంట్ అయ్యేంత తీవ్ర మలుపు ఏమి లేదన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలూ వెల్లడవుతాయని తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గురైన టిప్పర్ కండిషన్ మెకానిక్ ద్వారా పరిశీలిస్తున్నామని చెప్పారు. టిప్పర్ లారీ ఓనర్ లక్ష్మణ్‌నాయక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొండుతున్నాడని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదని, ఇది అందరి బాధ్యతగా చూడాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారిందని, చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని తెలిపారు. రోడ్డు మీద డ్రైవ్ చేసే వారు డిఫెన్స్ కండిషన్‌ను అంచనా వేసుకొని డ్రైవ్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై వచ్చే నెల నుంచి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ సంస్థలతో సమన్వయం చేస్తూ డ్రైవర్లలో భద్రతా చైతన్యం పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం చేవెళ్ల ప్రమాదంపై స్థానిక ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని, ఘటనకు కారణాలు త్వరలో వెల్లడిస్తామని డీజీపీ వెల్లడించారు. ఆయన వెంట అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, సీపీ అవినాష్ మహంతి, ఏసీపీ కిషన్, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



