వాహనదారులందరికీ విస్తృతమైన అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ – వనపర్తి
వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, వాహనదారులకు రహదారి భద్రత పై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత జిల్లా శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తెలంగాణ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించే వారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తు ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తోందని చెప్పారు. వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. వాహనదారులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు.
రవాణా, పోలీస్, ఆర్టీసీ, సంబంధిత శాఖలు సమన్వయము చేసుకొని మాసోత్సవాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తప్పనిసరిగా రోడ్ సేఫ్టీ మీటింగ్స్ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో, కాలేజీ లలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, స్పీడ్ డ్రైవింగ్ సహా అన్ని అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు రోడ్డు ప్రమాదాల కారణంగా 20 మంది మరణిస్తున్నారన్నారు. అవగాహన ద్వారా ఒక్క రోడ్డు ప్రమాదాన్ని నివారించినా ఆ కుటుంబానికి వెలుగులు నింపినట్లే అన్నారు. ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించి ప్రజలను, విద్యార్థులను, యువతను, వాలంటీర్ ఆర్గనైజషన్ వారిని భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, వాహనదారులకు రహదారి భద్రత పై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశం లో ఆర్ అండ్ బి ఈ ఈ దేశ్యా నాయక్, డి టీ ఓ మానస, డి ఎం హెచ్ ఓ సాయినాథ్ రెడ్డి, పంచాయత్ రాజ్ ఈ ఈ మల్లయ్య, ఐ ఆర్ ఏ డి డి ఆర్ యం మురళి కృష్ణ,ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



