– చెప్పకుండా కార్యక్రమాలా?
– మంత్రి తుమ్మల సమక్షంలోనే ఆర్ అండ్ బీ అధికారులపై ఎమ్మెల్యే జారే అసహనం
– గిరిజన ఎమ్మెల్యే అయినందునే అవమానించారని ఆరోపణ
నవతెలంగాణ-దమ్మపేట
2017 బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్డుకు ఇప్పుడు శంకుస్థాపనా చేస్తారా? స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యకమ్రాలు ఎలా నిర్వహిస్తారు? ఈ అభివృద్ధి కార్యక్రమాలను బహిష్కరిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమక్షంలోనే ఆర్‌అండ్‌బీ అధికారులపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అసహనం వ్యక్తం చేశారు. జారేను మంత్రి తుమ్మల సముదాయించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే చేయి పట్టుకుని తుమ్మల బలవంతంగా తన కారులో తీసుకుని వంతెనల ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, పూసుకుంట గ్రామానికి 2017లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.17 కోట్లు రోడ్డు నిర్మాణానికి మంజూరయ్యాయి. ఈ పనులు ఆనాడే ప్రారంభమయ్యాయి. వీటిలో భాగమైన మూడు వంతెనలు పూర్తయ్యాయి. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రోడ్డు పనులు పూర్తి కాలేదు. పూర్తయిన మూడు వంతెనలను ప్రారంభించడంతో పాటు రోడ్డును తాత్కాలికంగా మట్టి, గ్రావెల్‌లతో నిర్మించే పనులకు మంగళవారం శంకుస్థాపన చేయించాలని అధికారులు నిర్ణయించారు. వంతెనలు ప్రారంభానికి రావాలని ఎమ్మెల్యే జారేకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఆహ్వానం అందించారు. తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన విషయం జారే దృష్టికి తీసుకెళ్లకుండానే మంత్రి తుమ్మల సూచనతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వంతెనల ప్రారంభ ప్రదేశానికంటే ముందే తాత్కాలిక రోడ్డు శంకుస్థాపన ఉండటంతో అక్కడ వాహనాలు ఆగాయి.
ఇదేంటని జారే అధికారులను ప్రశ్నించారు. ”నా మనోభావాలు దెబ్బతిన్నాచి.. నాకు ప్రజలతోనే పని, ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నా.. కాంట్రాక్టర్‌తో మాట్లాడా, ఐదేండ్ల క్రితం ఇది మంజూరైంది” అంటూ ఒక దశలో తుమ్మలను కూడా జారే దిక్కరించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అన్ని కార్యక్రమాలను బహిష్కరించి వెనక్కి వెళ్లిపోతానని అసహనం వ్యక్తం చేశారు. వెనక్కి మళ్లిన జారేను మంత్రి తుమ్మల చేయిపట్టుకుని సముదాయించి కారులో ఎక్కించుకుని తాత్కాలిక రోడ్డు పనులకు శంకుస్థాపన చేయకుండానే వంతెనల ప్రారంభానికి తీసుకెళ్లారు. అనంతరం తేనెటీగల పెట్టెల పంపిణీ, పామాయిల్ మొక్కలు నాటి కార్యక్రమాలు పూర్తి చేయించారు. తిరుగు ప్రయాణంలో ఆగిపోయిన శంకుస్థాపనను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయగా, కాన్వాయిలో ఉన్న జారే వర్గీయులను.. దిశ కమిటీ సభ్యులు సొంగా ఏసుమణి, చిన్నశెట్టి యుగంధర్‌తో పాటు మరికొంత మంది జారేను అడ్డుకున్నారు. గిరిజన ఎమ్మెల్యే అయినందునే సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న వారిపై తమ్మల ఆగ్రహం వ్యక్తం చేసి శంకుస్థాపన చేశారు. పూసుకుంటలో జరిగిన సభలో తుమ్మల అధికారులకు ఇకమీదట ఇటువంటి పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితీష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎంసీ చైర్మెన్ వాసం రాణి, మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, సొసైటీ చైర్మెన్ యల్లిన రాఘవరావు, ఎర్రగొర్ల రాధాకృష్ణ, రావు గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ఎమ్మెల్యే అయినందునే..
జారే ఆదినారాయణ గిరిజన ఎమ్మెల్యే అయినందునే ఆర్‌అండ్‌బీ అధికారులు అవమానించారని కాంగ్రెస్ పార్టీకి చెందిన వాట్సప్ గ్రూపుల్లోనే పోస్టింగులు హౌరెత్తించారు. ఎమ్మెల్యేను కించపరిచే విధంగా అధికారులు వ్యవహరించారని, ఎమ్మెల్యేతో పాటు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.
2017లో మంజూరైన రోడ్డుకు శంకుస్థాపనా?
- Advertisement -
RELATED ARTICLES