ప్రపంచానికే ఆదర్శంగా తెలంగాణను నిర్మిస్తాం
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ముందుకు సాగుతాం
ప్రపంచ నగరాలు, దేశాలతోనే పోటీ
67,763 ఉద్యోగాల భర్తీ
ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబాలకు నగదు రహిత వైద్యం
ఉభయసభలనుద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు
వందేమాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం వాకౌట్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా అన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆవిష్కరణల కేంద్రంగా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేస్తున్నామన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. ప్రారంభంతో పాటు ముగింపు లోనూ తెలుగులో ఆయన మాట్లాడారు. ప్రసంగం మధ్యలో కొన్నిసార్లు తడబడ్డారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ త్రిభాషలో ఆయన ప్రసంగం సాగింది. కొన్ని పదాలను స్పష్టంగా పలకకపోవడంతో సభ్యులకు అర్థంకాక కొంత ఇబ్బంది పడ్డారు. ప్రస్తుత బడ్జెట్ కేవలం ఆర్థిక కేటాయింపుల గురించి మాత్రమే కాకుండా, బలమైన, స్థిరమైన రాష్ట్రాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం తెచ్చే ప్రతి పథకం, విధానం, కార్యాచరణలో ప్రజల ఆత్మగౌరవం, సంక్షేమం, సామాజిక సమానత్వం పాటించడమే ప్రజాపాలనకు గీటురాయిగా పాలనలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తున్నామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించామని తెలిపారు. 2025-26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.17.82 లక్షల కోట్లు కాగా, 10.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని అన్నారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.99 శాతమనీ, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరిందని వివరించారు. ద్రవోల్బణాన్ని 0.2 శాతానికి నియంత్రించామనీ, రాష్ట్రంలో ధరల స్థిరత్వం కొనసాగిందని చెప్పారు. నీటి పారుదల సదుపాయాలు మెరుగుపరిచి, వ్యవసాయ ఉత్పాదకత పెంచామనీ, అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూ, అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడంచెల వికేంద్రీకృత వ్యూహాన్నీ అనుసరిస్తున్నామన్నారు. 2031 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుకుంటుందనీ, దానిలో భాగంగానే జీహెచ్‌ఎంసీని సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించామన్నారు.
కొత్తగా తెస్తున్న క్యూర్ చట్టంతో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు,హైడ్రాను ఒకటే పాలనా పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌తోపాటు, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా పునర్‌వ్యవస్థీకరించామని అన్నారు. కాలుష్యం నుంచి తప్పించేందుకు హిల్ట్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకుపైగా ఆక్రమణలు, కబ్జాలకు గురైన చెరువు భూములు, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో 360 కిలోమీటర్ల ప్యూర్ (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ) ప్రాంతాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించామనీ, ఇక్కడ పలు రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.
కొడంగల్ ఏరియా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసేందుకు రాబోయే రేడియల్ రోడ్డు వెంట మల్టీ ప్రొడెక్ట్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని అన్నారు. జహీరాబాద్‌లో 3,245 ఎకరాల్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ స్మార్ట్ సిటీ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య అనుసంధానానికి రేడియల్ రోడ్లను నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ, అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైదరాబాద్-అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించనున్నట్టు వివరించారు. శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సులను ప్రస్తావించారు. రైతుభరోసా రూ.8,744 కోట్లు, సన్నరకం ధాన్యానికి బోనస్‌గా రూ.19,099 కోట్లను రైతులకు చెల్లించామన్నారు.
రూ.20,616 కోట్లను రైతుల ఖాతాల్లో వేసి 25 లక్షల మందికిపైగా రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. తెలంగాణ భూ భారతి చట్టం 2025ను, ప్రత్యేకంగా భూధార్ వ్యవస్థను తీసుకొచ్చామని వివరించారు. కృష్ణా, గోదావరి నదుల జలాల వాటాల్లో రాష్ట్ర ప్రయోజనాలను రక్షించేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేస్తామన్నారు.కొనసాగుతున్న ప్రాజెక్టులను మూడేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. రాష్ట్రంలో 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ అయ్యాయనీ, పాత రేషన్ కార్డుల్లో 19.44 లక్షల మంది కొత్త సభ్యుల పేర్లను చేర్చామని తెలిపారు. అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమనీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించామని చెప్పారు.
ఈ పథకాన్ని మొత్తం రూ.22,500 కోట్ల అంచనా వ్యయమవుతుందనీ, ఇప్పటివరకు 3,24,536 ఇండ్లు మంజూరు చేయగా 2,62,449 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయనీ, వీటికోసం ఇప్పటివరకు రూ.5,073.84 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.9,222 కోట్ల లబ్ది చేకూర్చామనీ, రూ.500కే ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నామనీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం రూ.3,900 కోట్లు ఖర్చు చేశామన్నారు. సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 212 శాతం పెంచామని చెప్పారు. పాఠశాలల్లో రూ.706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు చేపట్టామనీ, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రజా ప్రభుత్వం నిర్మిస్తున్నదని చెప్పారు.
వీటిలో 60 స్కూళ్ల నిర్మాణం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి రూ.4,903.44 కోట్లు సాయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని వివరించారు. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్‌ను స్థాపించామన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మాతృమరణాల నిష్పత్తిని ఆరు కంటే తక్కువ, శిశు మరణాల నిష్పత్తిని ఏడు కంటే తక్కువ తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ అన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), నిమ్స్ విస్తరణ, కొత్తగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టామని వివరించారు.
ఈ ఏడాది చివరి నాటికి వీటి సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’, ప్రజావాణి, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ వంటి పలు అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఎస్పీ వర్గీకరణ, డ్రగ్స్ నివారణకు ఈగల్ ఏర్పాటు వంటి విషయాలు ప్రస్తావించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 67,763 పోస్టులను భర్తీ చేసిందనీ, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు, సమ్మక్క సారలమ్మ జాతర, గద్దెల పునర్నిర్మాణం, ఎకో టెంపుల్ టూరిజం వంటి అనేక అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
కేసీఆర్ గైర్హాజరు
ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగ సమయంలో ఆయన ప్రధాన ప్రతిపక్షనేత స్థానం ఖాళీగా కనిపించింది. కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టాక, తొలిసారిగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంఐఎం వాకౌట్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సూచికగా తొలుత రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గేయం వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై ఎంఐఎం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన గీతాలాపన సమయంలో వారు సభలోకి వచ్చి, గవర్నర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మళ్లీ గవర్నర్ ప్రసంగం ముగింపు సందర్భంగా జయజయహే తెలంగాణ గీతాలాపన వరకు ఉండి, ‘వందేమాతరం’ ప్రారంభం కాగానే మళ్లీ నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు.
రాష్ట్రాభివృద్ధికి రోడ్‌మ్యాప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



