Monday, May 12, 2025
Homeదర్వాజబ్రతుకు బండ - మేకల బండ

బ్రతుకు బండ – మేకల బండ

- Advertisement -

ఆర్‌.సి. కష్ణస్వామిరాజు నవల ‘మేకలబండ’. ఇది ఒక మానవత్వపు బండ. సుందరం, పెంచల్‌ రాజు, వడివేలు, తిరుపాలు ఈ నవలలో కనిపిస్తున్న పాత్రలు మాత్రమే! వీళ్ళలాగా మరో ఉపాధి చేతగాక, మేకలనే నమ్ముకుని ఎదుగూ బొదుగూ లేని మందలోని మేకల్లా జీవనం సాగిస్తున్న వారి సజీవ గాథ ఈ నవల.
ఉలి దెబ్బల వల్ల బండ కూడా శిల్పకారుని చేతిలో శిల్పంగా మారుతుంది. కృష్ణస్వామిరాజు కలంతో, మారు మూల గ్రామాల్లో కేవలం పొట్ట కూటి కోసం, కుటుంబ పోషణ కోసం, జీవాలే ఆధారంగా జీవిస్తున్న వారి సజీవచిత్రాల్ని ఈ నవలలో చక్కగా చెక్కారు. మేకలకు వచ్చిన మానవ సంకుచిత స్వభావాలను బయటకు లాగి బండమీద పోసి మరీ ఎండగట్టారు. అంతేకాదు, బండలోపల కూడా ద్రవింపజేసే హదయం కూడా వుంటుందని తెలియచేసారు.
స్నేహనికి వయసుతో పనిలేదని, పెళ్ళికాని సుందరం, పెంచల్‌ రాజు, 60 ఏళ్ళ వడివేలు, 50 ఏళ్ళ తిరుపాలుల స్వచ్చమైన స్నేహం తెలుపుతుంది. పట్టణాలలోని మలినత్వం అంటని మట్టి మనుషులు వీళ్ళు.
విల్స్‌ సిగరెట్‌ పెట్టెల్లో బీడీలు పెట్టుకుని సిగరెట్‌ లాగినట్లు ఫీలయ్యే సుందరం…. ‘ఆడపిల్లలు ఫేంటు వేసుకున్న వాళ్ళనే ఇష్టపడతారేమో! ఇంక తనకి పెళ్ళి కాదేమో’ అని దిగులు పడటం లాంటి రచయిత చముక్కులు నవల నిండా కనబడతాయి.
పెళ్ళి సంబంధం వాళ్ళు పంపిన ఓ అమ్మాయి ఫొటోలో ఎత్తు పళ్ళున్నాయని ఫొటోని జేబులో పెట్టుకుని క్షణక్షణం చూసుకుంటూ ఉంటాడు పెంచల్‌ రాజు. అది చూసిన స్నేహితులు ‘ఎత్తుపళ్ళు ఉన్నాయని బాధపడకు, అమ్మాయి బాగానే ఉంది, మనలాంటి వాళ్లకి సంసారానికి పనికి వచ్చే అమ్మాయి అయితే చాలు’ అని చెబుతారు. పెంచల్‌ రాజు సంబరంగా ‘అయితే ఓకే చెప్పేస్తా!’ అంటాడు.
కుటుంబాన్ని పోషించుకోవాలని, చేసిన అప్పుల్ని తీర్చుకోవాలని, మంచిగా తిండి ఉంటే చాలని, పెళ్లిళ్లయితే చాలని అతి సామాన్యమైన చిన్న చిన్న కోరికలు, కలలతో జీవిస్తున్నారు వాళ్ళు.
గ్రామీణ జీవనం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు ఈ నవలలో. ఈ నాగరిక ప్రపంచంలో కట్టూ బొట్టూ మారింది గాని తల్లిదండ్రులని ఒంటరిని చేసి వదిలేసి పట్టణాలలో లక్షలు సంపాదించుకుంటూ జీవిస్తున్నారు. పక్కోడికి ఏం జరిగినా పట్టించుకునే స్థితిలో లేరు.
వీళ్లు మేకల్నే నమ్ముకుని బందీ జీవితం జీవిస్తుంటే వీళ్ళ నాలుగు మేకలు మాత్రం వీళ్ళనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి ‘ఈ బానిస జీవితం వద్దు, స్వేచ్చా జీవితం ముద్దు’ అనుకొని కూడబలుక్కొని పారిపోతాయి. దీనితో అసలు కథ మలుపు తిరుగుతుంది
సుందరం మేకపోతు, పెంచల్‌ రాజు నల్ల గొర్రె, తిరుపాలు తెల్ల పొట్టేలు, వడివేలు కుంటిమేక ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో, వారి వారి యజమానులు తమని పట్టించుకోని కారణాలని చాలా చక్కటి హాస్యంతో పండించారు.
జీవాలు పోవడంతో నలుగురి కలల సౌధం కుప్పకూలిపోతుంది. ఇంట, బయట చెల్లని బతుకులయ్యాయి. జీవాలను పోగొట్టుకొని ఉత్త చేతులతో తిరిగివచ్చిన వీళ్ళ చేతకానితనాన్ని ఊళ్లో అందరూ ఎత్తిచూపుతారు. సూటిపోటి మాటలతో హింసిస్తారు. అందరికీ లోకువ అవుతారు. వ్యంగ్యపు మాటలు పడాల్సి వస్తుంది.
ఇంకా ఈ నవలలో జంతు ప్రేమికురాలు, ట్రెక్కింగ్‌ రమణ, బాలు… ఎర్రచందనం దొంగతనం, సినిమా షూటింగులు ఇలా ఎన్నో పటిష్టమైన పాత్రలు వస్తుంటాయి. పాటలు గాని, పేర్లు గాని, వరసలు పెట్టుకొని పిలుచుకునే విధానం గాని చాలా తమాషాగా వ్యంగ్యంగా ఉండి, గమ్మత్తుగా ఉంటాయి.
స్వేచ్ఛగా బతకాలని వచ్చిన నాలుగు మేకలు అంతటితో ఆగకుండా తమకి మానవ ఆలోచనలు మాటలు కావాలనుకుంటాయి. అడవిలో కనిపించిన ‘తిర్యక్‌’ భాష తెలిసిన యోగి ద్వారా అనుకున్న వరం పొందడంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మానవుల్లో ఉండే కుళ్లూకుతంత్రాలు, అసూయ ద్వేషాలు, జాతి అహంకారం, వివక్ష, దోపిడీ, కక్షలూ కార్పణ్యాలు, పగ ప్రతీకారాలు, ఒకదానికి తెలియకుండా మరొకటి ఎత్తులకు పై ఎత్తులు వేయడం, ఇలా ఒకటేమిటి సమస్త దుర్గుణాలు అలవాడతాయి వాటికి. అది తెలుసుకున్న యోగి ఒక్కొక్క మేక బండారాన్ని అన్నిటి ముందు బయటపెట్టి వాటి అంతరంగాలలో ఉన్న మానవ సంకుచిత స్వార్థ స్వభావాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెబుతాడు.
కనువిప్పు కలిగిన మేకలు ”మమ్మల్ని క్షమించండి స్వామీ. మాకు మనుషుల స్వార్థపు ఆలోచనలు వద్దు. మానవులు ఇలా జీవిస్తున్నారని తెలుసుకోలేకపోయాం. అలాంటి జీవితం మాకొద్దు. మేము మాలాగే మేకల్లాగే కలిసి ఉండటమే ముద్దు. అదే మాకు ఆనందం” అని చెప్పి ఇచ్చిన వరాన్ని యోగికి వెనక్కి ఇచ్చేస్తాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేకలే జీవనాధారంగా బతుకుతున్న జీవితాలకి వెలుగు చూపించాలి. నాగరిక ప్రపంచంలో అనాగరిక ఆలోచనలు ఉన్నవారికి ఈ నవల కనువిప్పు కలిగించక మానదు. అడవిలో పూసిన పూల పరిమళాన్ని సమాజం నాలువైపులా వెదజల్లారు రచయిత. వారికి శతాభివందనాలు.

  • బి.రత్నకుమారి, 9493322851
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -