చర్చలకు భయమెందుకన్న వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు
కారకాస్ : వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగుజ్ త్వరలోనే అమెరికాలో పర్యటిస్తారు. గత పాతిక సంవత్సరాల కాలంలో వెనిజులా అధ్యక్ష బాధ్యతలలో ఉన్న వారు అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ కాలంలో న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సమావేశాలకు వెనిజులా అధ్యక్షులెవరూ హాజరు కాలేదు. ఎలాంటి భయానికి తావులేకుండా అమెరికాతో చర్చలు జరుపుతానని రోడ్రిగుజ్ తెలిపారు. ‘మా మధ్య ఉన్న విభేదాలు, సమస్యలను దౌత్య పరంగా పరిష్కరించుకునేందుకు ఎలాంటి భయానికి తావు లేకుండా చర్చలు జరుపుతాం’ అని చెప్పారు.
రోడ్రిగుజ్ ఇప్పటికీ అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నారు.
ఆమె ఆస్తులను అగ్రరాజ్యం ఫ్రీజ్ చేసింది. అమెరికాలో పర్యటించాల్సిందిగా ఆమెకు అందిన ఆహ్వానం ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపు తిప్పుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలావుండగా రోడ్రిగుజ్ బుధవారం వెనిజులా సైనిక దళాల నాయకత్వంలో కీలక మార్పులు చేశారు. ప్రాంతీయ కమాండ్లకు 12 మంది సీనియర్ అధికారులను నియమించారు. వెనిజులా చమురు అమ్మకాలకు అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఆమె ఇప్పటికే అనుమతి ఇచ్చారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. అనేక మంది రాజకీయ ఖైదీలను కారాగారాల నుంచి విడుదల చేశారు.



