శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఆధునిక భీష్ముడు కొణిజేటి రోశయ్య :బీసీ సంక్షేమ
శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రవీంద్రభారతిలో మాజీ సీఎం రోశయ్య 4వ వర్ధంతి సభ
నవతెలంగాణ-కల్చరల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదర్శవంత రాజకీయవేత్త.. నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకుడు.. సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి… క్రమశిక్షణకు మారుపేరు రోశయ్య అని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభ తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్‌తో కలిసి రోశయ్య చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోశయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆలోచన అభినందనీయమన్నారు. రోశయ్య జీవితం భావితరాలకు తెలియజేయాలన్నారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రోశయ్య ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా అనేక పదవులతోపాటు ఆర్థిక శాఖ మంత్రిగా పరిపాలనా దక్షత, ఆర్థిక నిపుణుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు.కొణిజేటి రోశయ్య ఆధునిక భీష్ముడిగా గుర్తింపు పొందారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన రాజకీయాలకతీతంగా అనుభవజ్ఞుడిగా, అందరి గౌరవాన్ని పొందిన గొప్ప నాయకుడన్నారు. రోశయ్య వ్యక్తిగతంగా ఎప్పుడూ పదవులు ఆశించలేదని, పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదన్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని ప్రశ్నించారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్‌ఎస్ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేవుళ్ల విషయంలో సీఎం ఒక సామెతగా చెప్పారని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్‌ఎస్ కోసమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్‌లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని తెలిపారు.
అవినీతికి అలవాటు పడిన కేసీఆర్ కుటుంబం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అని ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోశయ్య వర్ధంతి సభను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా తనను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు కాల్వ సుజాత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు కొణిజేటి శివ సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.



