Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరౌడీ షీటర్‌ బహిష్కరణ

రౌడీ షీటర్‌ బహిష్కరణ

- Advertisement -

వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

నవతెలంగాణ-వరంగల్‌
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మిల్స్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ వంచనగిరి సురేష్‌ అలియాస్‌ కోతి సురేష్‌ను బహిష్కరిస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ చట్టం, 2015 వరంగల్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌-26(1) ప్రకారం 6నెలలు బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కోతి సురేష్‌కు మిల్స్‌ కాలనీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, ఎస్‌ఐ మిథున్‌ ఉత్తర్వులను అందజేశారు. సదరు రౌడీ షీటర్‌పై గతంలో పలు నేర కేసులు ఉండటంతోపాటు ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తూ, శాంతియుత జీవన విధానానికి ఆటంకం కలిగిస్తున్నట్టు పోలీసుల రికార్డుల్లో వెల్లడయింది.

రౌడీషీటర్‌ అక్రమ కార్యకలాపాల కారణంగా ప్రజలు ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతనికి కారణాలు చూపించాలని నోటీసు జారీ చేయగా, సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదు. ఎలాంటి రాతపూర్వక వివరణ ఇవ్వలేదు. దాంతో అతని వైఖరి ప్రజా శాంతికి ముప్పుగా మారిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు 6 నెలలు బహిష్కరిస్తూ కమిషనరేట్‌ పరిధి నుంచి బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు హాజరు కోసం మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా నేరాలపై సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -