Tuesday, March 31, 2026
E-PAPER
Homeఆటలురాయల్స్‌ రాజసం

రాయల్స్‌ రాజసం

- Advertisement -

– సమిష్టిగా రాణించిన రాజస్తాన్‌
– సూర్యవంశీ 15బంతుల్లోనే అర్ధసెంచరీ
– చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు
గౌహతి:
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) ప్రారంభ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ సమిష్టిగా మెరిసింది. తొలుత బౌలింగ్‌లో బర్గర్‌, ఆర్చర్‌, రవీంద్ర జడేజా రాణించడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌(సిఎస్‌కె) 127పరుగులకే పరిమితం చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌.. అనంతరం సూర్యవంశీ 15బంతుల్లోనే అర్ధసెంచరీతో రాణించడంతో ఆ లక్ష్యాన్ని 12.1ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వర్షం కురవడం, టాస్‌ గెలవడం రాజస్తాన్‌కు కలిసొచ్చింది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌ ఎంచుకోగా… బౌలర్లు కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము కానీయలేదు. చెన్నై బ్యాటర్లను క్రీజ్‌లో కుదురుకోనివ్వక… వరుసగా వికెట్ల పడగొట్టారు. దీంతో చెన్నై 19పరుగులకే 3వికెట్లు, ఆ తర్వాత 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ లక్ష్యాన్ని రాజస్తాన్‌ 12.1ఓవర్లలో కేవలం 2వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యవంశీ అర్ధసెంచరీకి తోడు.. జైస్వాల్‌(38నాటౌట్‌), జురెల్‌(18), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌(14నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు టాస్‌ ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(6)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సంజూ శాంసన్‌(6)ను నంద్రె బర్గర్‌(2/26) బౌల్డ్‌ చేశాడు. డిఫెన్స్‌ ఆడాలనుకున్న అతడి అంచనా తప్పగా బంతి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఆ తర్వాతి ఓవర్లో గైక్వాడ్‌ను ఆర్చర్‌ ఔట్‌ చేయగా.. ఆయుష్‌ మాత్రే(0)ను బర్గర్‌ పెవిలియన్‌ పంపాడు. బర్గర్‌, ఆర్చర్‌ విజృంభణతో పవర్‌ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌(17) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, సుదీర్ఘ విరామం తర్వాత రాజస్థాన్‌కు ఆడుతున్న జడేజా తొలి ఓవర్లోనే తన మ్యాజిక్‌ చూపించాడు. పెద్ద షాట్లకు సిద్ధమైన సర్ఫరాజ్‌ను ఎల్బీగా ఔట్‌ చేయగా.. చెన్నై 51కే ఐదు వికెట్లు కోల్పోయింది. సిక్సర్‌ బాదిన శివం దూబే(6)ను సైతం జడేజా ఔట్‌ చేసి చెన్నైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా కార్తిక్‌ శర్మ(18), జేమీ ఓవర్టన్‌(43)లు చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయారు. సందీప్‌ శర్మ ఓవర్లో బౌండరీతో చెన్నై స్కోర్‌ వంద పరుగులు దాటింది. అన్షుల్‌ కంభోజ్‌ (7నాటౌట్‌) రెండు ఫోర్లు బాదగా.. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఓవర్టన్‌ సిక్స్‌ బాది ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు. దీంతో చెన్నై 19.4ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. రాజస్తాన్‌ బౌలర్లు ఆర్చర్‌, బర్గర్‌, జడేజాకు రెండేసి, బ్రిజేష్‌, సందీప్‌, బిష్ణోరుకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

ఓవర్టన్‌ ఒంటరి పోరాటం
రాజస్తాన్‌ బౌలర్లు బర్గర్‌, ఆర్చర్‌ నిప్పులు చెరిగే బంతులకు చెన్నై బ్యాటర్లు వరుసగా పెవీలియన్‌కు చేరుతున్నా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఓవర్టన్‌ అద్భుత పోరాటంతో మెరిసాడు. జట్టు స్కోర్‌ 57పరుగులకే 6వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన ఓవర్టన్‌.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ల సాయంతో జట్టు గౌరవప్రద స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డాడు. 36బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 43పరుగులతో మెరిసాడు.

ధోనీ లేకుండా తొలిసారి..
ఐపిఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎన్నడూ లేని విధంగా తొలి మ్యాచ్‌లో ధోనీ లేకుండా మ్యాచ్‌ ఆడింది. సుమారు 277 మ్యాచ్‌ల ఈ ఫ్రాంచైజీ ప్రస్తానంలో తొలిసారి ఓ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా ఇద్దరూ లేరు. సీఎస్‌కే చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఐపిఎల్‌ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైనా ఇప్పటికే ఐపిఎల్‌కు గుడ్‌బై చెప్పగా.. ధోని లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ గాయం కారణంగా ఈ సీజన్‌ తొలి రెండు వారాలకు దూరంగా ఉండనున్నాడు. ధోని-రైనా జోడీ సీఎస్‌కే విజయ ప్రస్తానంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ధోని సీఎస్‌కే సాధించిన ప్రతి విజయంలో కీలకంగా వ్యవహరించగా.. రైనా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరుగడించాడు.

స్కోర్‌బోర్డు…
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సంజు శాంసన్‌ (బి)బర్గర్‌ 6, గైక్వాడ్‌ (బి)ఆర్చర్‌ 6, ఆయుష్‌ మాత్రే (సి)ధృవ్‌ జురెల్‌ (బి)బర్గర్‌ 0, షార్ట్‌ (సి)జైస్వాల్‌ (బి)సందీప్‌ శర్మ 2, సర్ఫరాజ్‌ ఖాన్‌ (ఎల్‌బి)జడేజా 17, కార్తిక్‌ శర్మ (ఎల్‌బి)బ్రిజేశ్‌ శర్మ 18, దూబే (సి)బిష్ణోరు (బి)జడేజా 6, ఓవర్టన్‌ (రనౌట్‌) హెట్‌మైర్‌/జురెల్‌ 43, నూర్‌ అహ్మద్‌ (సి)జురెల్‌ (బి)ఆర్చర్‌ 1, హెన్రీ (సి అండ్‌ బి)బిష్ణోరు 5, కంబోజ్‌ (నాటౌట్‌) 7, అదనం 16. (19.4ఓవర్లలో ఆలౌట్‌) 127పరుగులు.
వికెట్ల పతనం: 1/14, 2/19, 3/19, 4/38, 5/51, 6/57, 7/74, 8/82, 9/94, 10/127
బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-19-2, బర్గర్‌ 4-0-26-2, బ్రిజేశ్‌ శర్మ 3-0-17-1, సందీప్‌ శర్మ 2.4-0-22-1, బిష్ణోరు 3-0-16-1, జడేజా 3-0-18-2.
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (నాటౌట్‌) 38, సూర్యవంశీ (సి)సర్ఫరాజ్‌ (బి)కంబోజ్‌ 52, ధృవ్‌ జురెల్‌ (బి)కంబోజ్‌ 18, రియాన్‌ పరాగ్‌ (నాటౌట్‌) 14, అదనం 6. (12.1ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 128పరుగులు.
వికెట్ల పతనం: 1/75, 2/99
బౌలింగ్‌: హెన్రీ 3-0-40-0, ఖలీల్‌ అహ్మద్‌ 3-0-17-0, కంబోజ్‌ 3-0-27-2, నూర్‌ అహ్మద్‌ 2-0-24-0, ఓవర్టన్‌ 1-0-14-0, షార్ట్‌ 0.1-0-1-0.

15 బంతుల్లోనే సూర్యవంశీ అర్ధసెంచరీ
ఐపిఎల్‌ అరంగేట్రంలోనే వేగవంతమైన శతకంతో చరిత్ర సృష్టించిన 14ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ మరోసారి మెరిశాడు. గౌహతి వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిసాడు. ఆరంభం నుంచి సిక్స్‌లు, ఫోర్లతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లపై విరుచుకుపడిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ 15 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో రెచ్చిపోయిన వైభవ్‌ రెండు సిక్సర్లతో అర్ధ సెంచరీ అందుకున్నాడు. తద్వారా రాజస్థాన్‌ తరఫున రెండో వేగవంతమైన, ఓవరాల్‌గా మూడో ఫాస్టెస్ట్‌ అర్థ సెంచరీతో మెరిసాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో శతకంతో భారత్‌ను విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -