Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలువరద సహాయక చర్యలకు జిల్లాకు రూ.కోటి

వరద సహాయక చర్యలకు జిల్లాకు రూ.కోటి

- Advertisement -

– ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు
– ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు
– సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని వెనక్కి పిలవండి : వరద సహాయక చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి పొంగులేటి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.కోటి అత్యవసర నిధులు మంజూరు చేస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వరద సహాయక చర్యలపె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్ధితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల పాటు రెడ్‌అలెర్ట్‌ జోన్‌లో ఉన్న మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేశారు. స్థానిక పరిస్థితుల మేరకు సహాయ చర్యల కోసం అవసరమైన జిల్లాలకు మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకుగాను ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలని కలెక్టర్లను ఆదేశించారు. విపత్తుల నిర్వహణా శాఖ ఆయా జిల్లాల్లో ఇరిగేషన్‌, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, రహదారులు, పోలీస్‌ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
వర్షం పడే సమయంలో విద్యుత్‌ స్తంభాల సమీపంలో ఉండకూడదని కోరారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామనీ, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మున్సిపల్‌, మెట్రో వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రైల్వే లైన్లు, లోలెవెల్‌ బ్రిడ్జీలు, కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో పోలీస్‌ సిబ్బందిని గస్తీ కోసం నియమించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు, ముంపు ప్రాంతాల్లో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యం వరద తాకిడికి గురయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి వారికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కలెక్టర్లకు సూచించారు. అర్హులైన పేదలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad