పార్లమెంట్‌లో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
రూ. 30 వేల కోట్లు ఖర్చు చేశాక మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు
ఈ ప్రాజెక్ట్‌కు టెక్నికల్ అప్రూవల్ మాత్రమే ఇచ్చాం
నిధులు ఇవ్వకపోవడం మంచిదైంది
కాళేశ్వరం లోపాలపై ఎంక్వైరీ జరుగుతోంది
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గత బీఆర్‌ఎస్ సర్కార్ దాదాపు రూ. లక్ష కోట్లకుపైగా నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ల పాలైందని కేంద్ర జలశక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్ విమర్శించారు. రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అప్రూవల్ కోసం తమ మంత్రిత్వ శాఖను ఆశ్రయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం టెక్నికల్ అప్రైజల్ కమిటీ(టీఏసీ) అనుమతి మాత్రమే ఇచ్చిందని, నిధులు ఇవ్వకపోవడం మంచిదైందని అన్నారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల్లో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి కృషి సింఛాయ్ యోజన (పీఎంకేఎస్ వై) కింద తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
”కాగ్ రిపోర్ట్‌లు రాష్ట్రానికి వెళ్తాయి. ఈ రిపోర్ట్‌లకు రాష్ట్రాలే జవాబుదారీగా ఉంటాయి. అయితే కాళేశ్వ రానికి సంబంధించి రాష్ట్రం నుంచి ఎలాంటి కాగ్ రిపోర్ట్ తమకు అందలేదు” అని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగం లో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరించిందన్నారు. ఈ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోనందున, దీనిపై తమ మంత్రిత్వ శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. గత మూడేండ్లుగా ఈ స్కీంలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. అయినప్పటికీ… ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ (పీడీఎంసీ) కింద తెలంగాణకు మొత్తం రూ. 873.95 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అందులో గత మూడేండ్లలో రూ. 194.63 కోట్లు అందించినట్టు వివరించారు.
కాళేశ్వరం నీటిలో కొట్టుకుపోయింది…: కేంద్ర మంత్రి పాటిల్
ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ బదులిస్తూ… ‘సహచర సభ్యులు డ్రింకింగ్ వాటర్ పేరుతో… ఇరిగేషన్‌కు సంబంధించి ప్రశ్నను లేవనెత్తారు. కాళేశ్వరానికి సంబంధించి జలవనరుల శాఖ పరిధిలోని అంశాలకు సమాధానం ఇస్తాను. కాళేశ్వరం కోసం రూ. 30 వేల కోట్లు ఖర్చు చేశాక అఫ్రూవల్ కోసం మా శాఖకు ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి టెక్నికల్ అఫ్రూవల్ మాత్రమే పూర్తి చేసి ఇచ్చాం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మా నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. అయితే ప్రస్తుతం కాళేశ్వరం పరిస్థితి ఏంటో దేశం మొత్తానికి తెలుసు. దాదాపు రూ. లక్షకోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నీటిలో కొట్టకుపోయింది. కాళేశ్వరం లోపాలపై విచారణ కూడా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బోర్‌వెల్స్ వేసి, కొత్తగా ఈ ప్రాజెక్ట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై పని చేస్తున్నాం. ఈ విషయంలో సర్వే చేస్తోన్న ఏజెన్సీ నత్తనడకన పనులు చేస్తోంది.
దీని కారణంగా ప్రజలకు ఇంకా నీళ్లు అందడం లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం జల్ జీవన్ మిషన్ నుంచి నిధులు తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు నిధుల విషయంలో మా దగ్గర ఎలాంటి సమాచారం లేకపోవడం మంచిదైంది. కానీ జల్ సింఛాయ్, జల్ భాగిధారి కార్యక్రమంలో తెలంగాణ మంచిపనితీరును కనబర్చింది. అందుకు తగ్గట్టుగా అధిక నిధుల తో పాటు రూ.2 కోట్ల బహుమానం కూడా దక్కింది’ అని బదులిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందిస్తూ… ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేవలం సాంకేతిక సహకారానికి సంబంధించి అనుమతి మాత్రమే ఇచ్చాం. ఆ తర్వాత ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బయటి నుంచి నిధులు తీసుకోవచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. అవి 60:40 లేదా ఇతర నిష్పత్తిలో రుణాలు పొందవచ్చు.’ అని క్లారిటీ ఇచ్చారు. సీబీఐ ఇతర ప్రశ్నలకు సంబంధించి.. తన పరిధిలోనిది కానందున ఇందుకు తాను బదులివ్వలేనని సమాధానం ముగించారు.



