Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.10వేల కోట్లు కేటాయించాలి

రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.10వేల కోట్లు కేటాయించాలి

- Advertisement -

– సర్కారుకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ వినతి
– మహాలక్ష్మితోపాటు ఇతర రాయితీల బకాయిలు చెల్లించాలి
– పాత వేతన ఒప్పందాలను అమలు చేయాలి
– విద్యుత్‌ బస్‌ల విధానాన్ని సవరించాలి
– మార్చ్‌ 23న ‘మహాదీక్ష’ను జయప్రదం చేయండి : ఆర్టీసీ కార్మికులకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ ఆర్టీసీతో పాటు అందులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఈనెల 23న హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో మహాదీక్షకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. విద్యుత్‌ బస్‌ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలనీ, వీటి కోసం రాష్ట్ర బడ్జెట్‌ లో నిధులు కేటాయించాలనీ, మహాలక్ష్మి, ఇతర రాయితీల మొత్తం చెల్లించాలనీ, విద్యుత్‌ బస్‌ల పేరుతో మెకానిక్‌ల రీకేటగిరైజేషన్‌ను నిలిపివేయాలనీ, బకాయి ఉన్న 2021, 2025 పాత వేతన ఒప్పందాలను అమలు చేయాలనీ, ఆర్టీసీలో యూనియన్లపై ఉన్న ఆంక్షలు ఎత్తేసి, తక్షణమే గుర్తింపు ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేసింది. యూనియన్‌ అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షతన గత 23 న రాష్ట్ర కమిటీ , 26న రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2026 మార్చి 23న జరిగే మహాదీక్షలో ప్రతి డిపో నుంచి ఐదుగురికి తగ్గకుండా హాజరు కావాలనీ, తద్వారా ఆర్టీసీ కార్మికుల సమస్యలు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల దష్టికి తీసుకుపోవాల్సి ఉందని ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం తెలియజేసింది. డబ్బులు లేవనే పేరుతో కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 నాటి అలవెన్సులే నేటికీ చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. రిటైరైన వారి డబ్బులు చెల్లించడం లేదనీ, ఆర్టీసీలో ఏర్పడుతున్న ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా 1000 మంది వరకు థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు కండక్టర్లను తీసుకున్నారని చెప్పారు. డ్యూటీల బుకింగ్‌లో రెగ్యులర్‌ కండక్టర్లకు కాకుండా కాంట్రాక్టు కండక్టర్లకు బుక్‌ చేసి, రెగ్యులర్‌ కండక్టర్లను ఇబ్బంది పెడ్తున్నారన్నారు. తక్షణమే దీనిని అరికట్టాలని అభిప్రాయపడ్డారు. డబ్బులు చెల్లిస్తున్న పురుష ప్రయాణికుల కంటే మహాలక్ష్మి టికెట్‌ ఇవ్వడం కోసం ఎక్కువ శ్రమీస్తున్నప్పటికీ, మహాలక్ష్మి డబ్బులకు ఇచ్చే ఇన్సెంటివ్‌ను తక్కువ చేసి ఇస్తున్నారనీ, దీన్ని వెంటనే సరి చేయాలనీ డిమాండ్‌ చేశారు. మహాలక్ష్మి స్కీం అమల్లోకి వచ్చిన 2023 డిసెంబర్‌ నుంచే ఆర్టీసీకి బస్‌పాస్‌ రాయితీలతో కలిపి నెలకు రూ. 450 కోట్లు ఆర్టీసికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూనే ఉందన్నారు. కాని ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదన్నారు. 2026-27 బడ్జెట్‌ లోనైనా పెరిగిన మహాలక్ష్మి ప్రయాణికులు, బస్‌పాస్‌ రాయితీలతో కలిపి నెలకు రూ. 500 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని కోరారు. 2019 నుంచి 2025 డిసెంబర్‌ వరకు 10 వేల మంది కార్మికులు తగ్గిపోయారనీ, అయినా ఆర్టీసీ యాజమాన్యానికి రోజుకు తిప్పుతున్న కిలోమీటర్లు మాత్రం 32 లక్షలు నుంచి 37 లక్షల వరకు పెంచి మోయలేని భారం మోపుతున్నారన్నారు. తక్షణమే పని భారం తగ్గించాలని సమావేశం కోరిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన ఆర్టీసీ ఉనికే ప్రమాదంలో పడుతున్నదనీ, విద్యుత్‌ బస్‌ల వల్ల ఆ ప్రమాదం మరింత పెరిగిందనీ, అందుకే ఆ విధానాల ప్రభావాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలనే లక్ష్యంతో మార్చి 23న మహాదీక్ష నిర్ణయించినట్టు ఆ సంఘం ప్రకటించింది. అన్ని స్థాయిల కమిటీలు మహదీక్షను జయప్రదం చేసేందుకు ఇప్పటి నుండే ప్లాన్‌ చేసుకొనాలని సమావేశం కోరింది. ప్రధాన కార్యదర్శి వి. ఎస్‌. రావు ప్రవేశపెట్టిన కర్తవ్యాలను ఆఫీస్‌ బేరర్లంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో లింగమూర్తి, రవీందర్‌ రెడ్డి, సత్తిరెడ్డి, ప్రభాకర్‌, కష్ణ, బి. సుధాకర్‌, సుధాకర్‌, పద్మావతి, ఉపేంద్రచారీ, రాంచందర్‌, వి. శ్రీనివాస్‌, పి. శ్రీకాంత్‌, ఎం. బీమ్‌రావు తదితరులు హాజరయ్యారు.ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -