Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంఎన్‌సీడీసీకి రూ.2వేల కోట్ల గ్రాంటు

ఎన్‌సీడీసీకి రూ.2వేల కోట్ల గ్రాంటు

- Advertisement -

– పీఎంకేఎస్‌వై వ్యయం రూ. 6,520 కోట్లకు పెంపు : కేంద్ర మంత్రివర్గం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

రూ.2 వేల కోట్ల వ్యయంతో నేషనల్‌ కోపరేటివ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ)కు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసారశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌ మంత్రివర్గ వివరాలు వెల్లడించారు. 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేండ్ల కాలానికి పథకం కోసం రూ.2 వేల కోట్లు (ఏటా రూ.500 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నాలుగేండ్లలో ఎన్‌సీడీసీ రూ.20 వేల కోట్లు సేకరిస్తుందని, ఈ నిధులను కొత్త ప్రాజెక్టులు, పాంట్ల విస్తరణ, సహకార సంస్థలకు రుణాలు ఇవ్వడం, మూలధన అవసరాలను తీర్చేందుకు రుణాలు అందించేందుకు వినియోగిస్తుందని తెలిపారు. దీంతో 13,288 సహకార సంఘాల్లోని 2.9 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ, పశువులు, మత్స్య సంపద, చక్కెర, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్‌, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజ్‌ వంటి వివిధ రంగాలలో కార్మికులతో పాటు మహిళల నేతృత్వంలో సహకార సంస్థలు నడుస్తున్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం (2021-22 నుంచి 2025-26 వరకు) కాలానికి కేంద్ర ప్రాయోజిత పథకం ”ప్రధాన మంత్రి కిసాన్‌ సంపద యోజన (పీఎంకేఎస్‌వై)” మొత్తం వ్యయాన్ని రూ. 6,520 కోట్లను పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇందులో రూ.1,920 కోట్ల వ్యయాన్ని అదనంగా చేర్చినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. 13 జిల్లాల్లో మల్టిట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వివరించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో 13 జిల్లాలు విస్తరించి ఉన్నాయని, ఈ ప్రాజెక్టులతో సుమారు 574 కిలో మీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్‌ విస్తరిస్తుందని తెలిపారు. ఇటార్సీ, నాగ్‌పూర్‌ మధ్య నాలుగో లైన్‌ ఏర్పాటు, ఔరంగాబాద్‌ (ఛత్రపతి సంభాజీనగర్‌) – పర్భాని డబ్లింగు, అలువాబాడీ రోడ్డు-న్యూ జల్‌పాయిగుడీ మూడో, నాలుగో లైన్‌, డంగోపోసీ-జారోలీ మూడో, నాలుగో లైన్‌ ప్రాజెక్టుల ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా ఖర్చు దాదాపు రూ.11,169 కోట్లని, 2028-29 కల్లా పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులతో సుమారు 2 .29 కోట్ల పనిదినాల మేరకు ప్రత్యక్ష ఉపాధి కల్పన జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -