Saturday, October 11, 2025
E-PAPER
Homeజాతీయంరూ.2,221 కోట్లు ఇవ్వాలి

రూ.2,221 కోట్లు ఇవ్వాలి

- Advertisement -

రుణ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి
ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఆమోదం వేగవంతం చేయాలి
బకాయిలుగా మారిన వరి సేకరణ సబ్సిడీ మంజూరు వెంటనే జరగాలి
ప్రధాని మోడీతో కేరళ సీఎం పినరయి విజయన్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వయనాడ్‌ విపత్తులో బాధితుల పునరావాసం కోసం కేంద్రం రూ.2,221.03 కోట్లు ఇవ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ డిమాండ్‌ చేశారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఆమోదం వేగవంతం చేయాలని కోరారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని మోడీని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కలిశారు. ఈ సందర్భంగా కేరళ పురోగతి, ఉపశమనం, ఆర్థిక స్థిరత్వం వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. భైరవన్‌ థెయ్యం శిల్పాన్ని ప్రధానికి సీఎం అందజేశారు. అలాగే నలుగురు కేంద్ర మంత్రులను కూడా విజయన్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్‌ విలేకరులతో మాట్లాడుతూ వయనాడ్‌లోని ముండక్కై చూరల్మాల విపత్తు బాధితుల పునరావాసం కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌) నుంచి రూ. 2,221.03 కోట్లు కేటాయించాలని పునరుద్ఘాటించానని తెలిపారు.

దీనిని రుణంగా కాకుండా ఉపశమనం, పునర్నిర్మాణానికి గ్రాంట్‌గా పరిగణించాలని కూడా తాను అభ్యర్థించానన్నారు. ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రధాని మోడీని ఒప్పించడానికి కూడా ప్రయత్నించానని తెలిపారు. ”రుణ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, ఐజీఎస్టీ రికవరీని తిరిగి చెల్లించడం, అదనపు బడ్జెట్‌ రుణాలలో కోతను వాయిదా వేయాలి. జీఎస్‌డీపీలో అదనంగా 5 శాతం రుణం తీసుకోవడానికి అనుమతించాలి. జాతీయ రహదారి భూసేకరణ ఖర్చులో 25 శాతం భరించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి” అని ఆయన డిమాండ్‌ చేశారు. ”కోజికోడ్‌లోని కినలూర్‌లో గుర్తించిన స్థలంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఆమోదం వేగవంతం చేయాలి. వేగవంతమైన పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయ పట్టణ ప్రణాళిక, నిర్మాణ పరిశోధనలను బలోపేతం చేయడానికి రాష్ట్రంలో ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ స్కూల్‌ (ఎస్పీఏ)ను ఏర్పాటు చేయాలి.

సాంకేతిక అడ్డంకుల కారణంగా బకాయిపడిన వరి సేకరణ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలి. ఇందులో భాగంగా రవాణా ఛార్జీలకు సంబంధించిన 257.41 కోట్లు ఇవ్వాలి. ఈ మొత్తంలో బకాయిలు వరి రైతులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తున్నాయి” అని తెలిపారు. ఈ డిమాండ్లు రాష్ట్ర సంక్షేమం కోసం మాత్రమే కాకుండా, విపత్తు నిర్వహణ, ఆర్థిక సమాఖ్యవాదం, ఆరోగ్యంలో పురోగతి, విద్యా సమానత్వం, ఆహార భద్రత, స్థిరమైన పట్టణీ కరణ అనే జాతీయ లక్ష్యాలతో కూడా ముడిపడి ఉన్నాయని ప్రధాని మోడీకి వివరించారు. ”రాష్ట్రానికి ఉన్న కీలకమైన అవసరాలను కేంద్రం ఇప్పటివరకు పరిగణనలోకి తీసుకోలేదు. అటువంటి పరిస్థితిలోనే డిమాండ్లు లేవనెత్తడం, వాటి తీవ్రతను ప్రధాని, కేంద్ర‌ మంత్రులకు వివరించాం. రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నాను” అని సీఎం పినరయి విజయన్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -