– ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ
– రైతులకు ఉచిత విద్యుత్
– బీహార్‌లో ముగిసిన తొలిదశ ప్రచారం
– చివరి రోజు విస్తృతంగా ప్రచారం
పాట్నా : బీహార్‌లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర కంటే వరికి క్వింటాలుకు రూ. 300, గోధుమలకు రూ. 400 బోసస్‌గా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆర్జేడీ నాయకులు, ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మంగళవారం హామీ ఇచ్చారు. అలాగే, ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పాటయితే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (పీఏసీఎస్), ప్రాథమిక మార్కెటింగ్ సహకార సంఘాల (వ్యాపర్ మండల్) అధ్యక్షులకు ‘ప్రజాప్రతినిధుల హోదా’ ఇస్తామని కూడా తేజిస్వ యాదవ్ హామీ ఇచ్చారు. పాట్నాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీహర్‌లో 8,400 కంటే ఎక్కువగా పీఏసీఎస్ లు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంతో పాటు మంగళవారం చెరియాలోని ఎన్నికల ప్రచారంలోనూ తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. వీటిల్లో ఆయన మాట్లాడుతూ బీహార్‌లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే రైతులకు నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ కార్యకలాపాలలో ఉపయోగించే విద్యుత్‌కు రైతుల నుంచి యూనిట్‌కు 55 పైసలు వసూలు చేస్తుందని గుర్తు చేశారు. అదేవిధంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే ‘మై-బహిన్ మాన్ యోజన’ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా జనవరి 14న సంక్రాంతి రోజున రాష్ట్రంలోని మహిళలకు రూ.30వేలు కానుకగా అందచేస్తామని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఇటీవల నవరాత్రి కానుకగా ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో నగదు జమ చేసింది. గతవారంలో విడుదల చేసిన ఇండియా బ్లాక్ మ్యానిఫెస్టో ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి వచ్చే ఐదు సంవత్సరాల వరకూ మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి మొత్తం రూ.30,000 ఇవ్వనున్నారు. దీనినే సంక్రాంతికి మహిళల ఖాతాల్లో రూ.30వేలు జమ చేస్తామని తేజస్వి యాదవ్ చెప్పారు. రాష్ట్రంలోని మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ విధంగా చేస్తున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన ఈ సమయంలో ఈ పథకం మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని తేజస్వియ హామీ ఇచ్చారు. అలాగే, పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయు లతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరీకి వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియామ కాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బీహార్‌లో తొలిదశకు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. చివరిరోజు విస్తృతంగా ప్రచారంలో నాయకులు పాల్గొన్నారు. తొలిదశలో భాగంగా గురువారం 18 జిల్లాలోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొలి దశలో 1,314 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 3 కోట్ల 75 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పాట్నాతో సహా దర్భంగా, మధేపుర, సహస్రా, ముజఫర్‌పుర, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపుర్, బెగుసరాయి, లఖిసరాయి, ముంజెర్, షేక్‌పుర, నలంద, బక్సర్, భోజ్‌పుర జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి.
వరికి రూ.300, గోధుమకు రూ.400 బోనన్
- Advertisement -
- Advertisement -



