Saturday, March 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురూ.33 లక్షల కోట్ల సంపద ఆవిరి

రూ.33 లక్షల కోట్ల సంపద ఆవిరి

- Advertisement -

రెండు వారాల్లోనే భారీ నష్టాలు
దలాల్‌ స్ట్రీట్‌లో యుద్ధ విలయం
రూపాయి ఆల్‌టైం కనిష్టానికి పతనం
ఇన్వెస్టర్లు బెంబేలు

ముంబయి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధోన్మాదం భారత మార్కెట్లను అమాంతం ముంచేస్తోంది. ఇజ్రాయిల్‌, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై సాగిస్తోన్న మారణహోమం భారత ఇన్వెస్టర్లను బెంబేలెత్తిసోంది. ఈ పరిణామాల నేప్పథ్యంలో దలాల్‌ స్ట్రీట్‌లో ఇటీవల ప్రతీ రోజు సగటున రూ.3 లక్షల కోట్ల పైగా సంపద హరించుకుపోయింది.. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుండి కేవలం రెండు వారాల్లోనే రూ.33 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఫిబ్రవరి 27న రూ.463.26 లక్షల కోట్లుగా ఉన్న బిఎస్‌ఇ మార్కెట్‌ క్యాపటలైజేషన్‌ మార్చి 13 నాటికి రూ.429 లక్షల కోట్లకు పడిపోయింది.

ఈ కాలంలో సెన్సెక్స్‌ 7.8 శాతం, నిఫ్టీ 7.6 శాతం మేర కుప్పకూలాయి. గడిచిన రెండు వారాల్లో 9 రోజులు మాత్రమే మార్కెట్లు పని చేశాయి. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్‌ ఏకంగా 1,500 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర పాతాళానికి పడిపోయి ఇన్వెస్టర్లను వణికించాయి. ఈ ఒక్క పూటలోనే దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.21 శాతానికి పెరగడం తాజాగా ఆందోళన పెంచింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర 100 డాలర్ల పైన పడిపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.44కు పడిపోయి ఆల్‌టైం రికార్డు కనిష్టాన్ని చవి చూసింది. గ్యాస్‌ సరఫరాలో తీవ్ర అంతరాయాలు తదితర పరిణామాలు ఇన్వెస్టర్లను మరింత ఆందోళనకు గురి చేస్తోన్నాయి.

దిగ్గజ సంస్థలకు భారీ దెబ్బ..
ఈ మార్కెట్‌ క్రాష్‌లో దిగ్గజ కంపెనీలు భారీగా నష్టపోయాయి. కేవలం రెండు వారాల్లోనే ఎస్‌బిఐ మార్కెట్‌ విలువ రూ.1.07 లక్షల కోట్లు ఆవిరి కాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ రూ.84,493 కోట్లు, బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.82,728 కోట్లు), ఐసిఐసిఐ బ్యాంక్‌ రూ.80,747 కోట్లు, ఎల్‌అండ్‌టి రూ.76,979 కోట్లు చొప్పున పతనమై ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీశాయి.

ఎఫ్‌ఐఐలు పలాయనం
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) భారత మార్కెట్‌ నుండి నిరంతరం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గురువారం ఏకంగా రూ.7,049.87 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతకుముందు మూడు రోజుల్లో కూడా సుమారు రూ.17,000 కోట్ల విక్రయాలు జరిగాయి. నిఫ్టీ ప్రస్తుత మద్దతు స్థాయి 23,300ను గనుక కోల్పోతే తదుపరి పతనం మరింత భీభత్సంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -