జైపూర్ మెట్రో ఫేజ్-2కు రూ. 13, 038 కోట్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఖరీఫ్ సీజన్ కోసం నూట్రియంట్ బేస్డ్ సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం రూ.41,533.81 కోట్లు కేటాయించింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలను వివరించారు. ”ఖరీఫ్ సీజన్ కోసం నూట్రియంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపాం. ఇది 2025 ఖరీఫ్ సీజన్‌లో బడ్జెటరీ కేటాయింపుల కంటే రూ.4,313 కోట్లు అధికం. 2025 ఖరీఫ్ బడ్జెట్ రూ.37,216.15 కోట్లుగా ఉంది” అని తెలిపారు. జైపూర్ మెట్రో ఫేజ్-2కు కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. రూ.13,038 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతారు.
ప్రహ్లాద్‌పుర నుంచి తోడి-మోడ్ వరకూ 36 స్టేషన్లను కలుపుతూ 41 కిలోమీటర్ల పొడవైన నార్త్-సౌత్ కారిడార్‌గా దీన్ని నిర్మించనున్నారు. కేంద్రం, రాజస్తాన్ ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా రాజస్తాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిని చేపడుతుంది. రాజస్తాన్‌లో హెచ్‌పీసీఎల్ రిఫైనర్ కోసం రూ.79,459 కోట్లను కేటాయించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమ్లే, క్రా దాది-కురుంగ్ కుమే జిల్లాల్లో రూ.26,069.50 కోట్లతో 1720 మెగావాట్ల ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు 96 నెలల్లో పూర్తవుతుందని అంచనా వేశారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో 1200 మెగావాట్ల కళాయి-2 హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.14,105.83 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.



