Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీత వృత్తి రక్షణకు రూ.5 వేల కోట్లు కేటాయించాలి

గీత వృత్తి రక్షణకు రూ.5 వేల కోట్లు కేటాయించాలి

- Advertisement -

– ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్ష
– కల్లుగీత కార్మిక సంఘం (KGKS) జిల్లా అధ్యక్షులు సైదగౌని వెంకట్ గౌడ్ పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి 

కల్లుగీత వృత్తి రక్షణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5,000 కోట్లు కేటాయించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నామని కల్లుగీత కార్మిక సంఘం (KGKS) జిల్లా అధ్యక్షులు సైదగౌని వెంకట్ గౌడ్ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశం అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం గీత కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. గత సంవత్సరం బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయించినప్పటికీ నిధుల లేమి పేరుతో విడుదల చేయలేదని, కేవలం రూ.17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారని విమర్శించారు.

ఈసారి బడ్జెట్‌లోనైనా రూ.5,000 కోట్లు కేటాయించి గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. పెన్షన్‌ను రూ.2,000 నుండి రూ.4,000లకు పెంచుతామని, ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి నెలరోజుల్లో అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటివరకు పెంచకపోగా, ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా నిధులు కూడా రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 850 మందికి రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపై ముఖ్యమంత్రి కి, సంబంధిత మంత్రులకు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. 2025 జూలై 14న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరాహార దీక్షలు, 2025 నవంబర్ 28న వేలాది గీత కార్మికులతో సూర్యాపేటలో గీతన్నల రణభేరి నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికే రాష్ట్ర కార్యవర్గం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు పూనుకుందని, జిల్లాలోని గీత కార్మికులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రాష్ట్ర బడ్జెట్‌లో కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5,000 కోట్లు కేటాయించి గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలి. కల్లుగీత వృత్తి చేసే వారందరికీ “కాటమయ్య రక్షణ కవచం” కల్పించాలి. ఎన్నికల హామీల ప్రకారం పెన్షన్‌ను రూ.4,000లకు, ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలి. పెండింగ్ ఎక్స్గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలి. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలి. నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు స్థాపించి, నెక్లెస్ రోడ్ వద్ద మూసివేసిన నీరా కేఫ్‌ను తిరిగి ప్రారంభించాలి.

చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలి. కల్లుగీత సొసైటీలను బలోపేతం చేసి, కేంద్ర ప్రభుత్వం ప్రతి సొసైటీకి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో సొసైటీలను పునరుద్ధరించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.

కల్లులోని పోషక, ఔషధ గుణాలను ప్రభుత్వం ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, లిక్కర్ షాపుల్లో గౌడులకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి. కల్లు షాపులపై ఎక్సైజ్ దాడులను అరికట్టాలనీ తదితర డిమాండ్లను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజా గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రవీందర్ గౌడ్, స్వామి గౌడ్, సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -