నిందితుల్లో ఒకరి అరెస్ట్.. 137 మంది బాధితులు
నవతెలంగాణ-నిజాంపేట్
ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి ముగ్గురు వ్యక్తులు రూ.50 లక్షలు వసూలు చేసి బురిడీ కొట్టించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఒకరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ బాచుపల్లి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, కేసు దర్యాప్తు అధికారి ఎన్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్టీనేషన్ పరిశ్రమల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జక్కుల అజరు, కొండాజి శ్రావణి, సాదుల సద్గుణ గ్రూపుగా ఏర్పడి ప్రచారం చేశారు. నిజాంపేట్ నివాసి కాసుల జగదీష్ వారి మాటల్ని నమ్మి మోసపోయాడు. ఒక్కొక్కరి ద్వారా రూ.20వేల నుంచి 90 వేల వరకు ప్లేస్మెంట్ చార్జీల రూపంగా వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన కాసుల జగదీష్ ఫిబ్రవరి 14న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా మొత్తం బాధితులు 137 మంది ఉన్నారని తేలింది. ఫిర్యాదుదారుడు తన ఖాతా నుంచి, అతని సహచరుల ఖాతాల నుంచి మొత్తం రూ.47 లక్షల 20వేలు నిందితులకు బదిలీ చేశాడు. బాధితులకు ”హక్సిన్స్” అనే కంపెనీ నుంచి నకిలీ ఆఫర్ లెటర్స్ కూడా అందించారు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగితే నిందితులు స్పందించడం మానేశారు. దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులిద్దరి బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్లను, ఆర్థికపరమైన లావాదేవీలను నిర్ధారించుకొని ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ నెల 9న పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి వెళ్లి ప్రధాన నిందితుడు జక్కుల అజరును పట్టుకున్నారు. విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించారు. కొండాజి శ్రావణితో కలిసి కుట్ర పన్నినట్టు అతడు వెల్లడించాడు. శ్రావణి గతంలో ఒక పరిశ్రమలో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్లో పనిచేసేది. నిరుద్యోగులను మోసం చేసే సందర్భంలో తాను హెచ్.ఆర్ నంటూ నమ్మించేది. ఆమెనే నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లకు ప్రతిపాదన చేసినట్టు జక్కుల అజరు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.50 లక్షల మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



