ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తునకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
చెన్నై : రెండు కేసుల్లో అనుకూలంగా తీర్పులిచ్చేందుకు న్యాయమూర్తికి ఇవ్వడానికి సీనియర్ న్యాయవాది రూ.50 లక్షలు సేకరించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా విజిలెన్స్ విభాగానికి మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదుల సమాఖ్య సిట్టింగ్ న్యాయమూర్తికి రాసిన లేఖలో ఈ ఆరోపణ చేశారు. ఈ రెండు కేసుల విచారణ నుంచి జస్టిస్ ఎం.నిర్మల్‌కుమార్ తప్పుకుంటూ ఈ అంశాన్ని విజిలెన్స్ సెల్‌కు నివేదించారు. ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. విచారణకు అవసరమైన సూచనలు కూడా చేయాల్సిందిగా కోరారు. సీబీఐ దర్యాప్తు చేసిన రూ.89.90 కోట్ల బులియన్ ట్రేడింగ్ మోసం కేసుకు సంబంధించినవే ఈ రెండు కేసులు. తనపై ఛార్జిషీట్‌ను కొట్టివేయాలని కోరుతూ నరేష్ ప్రసాద్ అగర్వాల్ అనే వ్యక్తి 2014లో పిటిషన్ వేశారు.
సహ నిందితుడు ఎన్.గణేష్ అగర్వాల్ 2015లో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. గతంలో ఒక నిందితుడి ఛార్జిషీట్‌ను కొట్టివేసిన హైకోర్టు జడ్జి 2017లో మరో వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. ఆ అంశాలపై తాజాగా పరిశీలన జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజా ఆరోపణలు బయటపడడానికి ముందు వరకు 2025 సెప్టెంబరు నుంచి జస్టిస్ కుమార్ ఈ రిమాండ్ కేసులను విచారిస్తూ వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను సీనియర్ న్యాయవాది తిరస్కరించారు. ఏ విచారణకైనా తాను సహకరిస్తానని పేర్కొన్నారు. అటువంటి లేఖలు న్యాయస్థానం ప్రతిష్టను దిగజారుస్తాయని సీబీఐ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసన్ వాదించారు. తక్షణమే బాధ్యుడైన ఆ వ్యక్తిని గుర్తించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.



