నవతెలంగాణ – భువనగిరి
అసెంబ్లీ సమావేశాల్లో బస్వాపురం ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, ముంపుకు గురైన గ్రామాలకు, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహరం చెల్లించి పునరావాసం కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మూసీ మురికి నీళ్లతో బాధపడుతున్న ఈ ప్రాంత రైతాంగానికి ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సూచించారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో సిపిఎం మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కొండమడుగు నరసింహ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని 10 మండలాలకు సాగు, త్రాగు నీటికి కీలకంగా ఉపయోగపడే బస్వాపురం ప్రాజెక్టు 90 శాతం పైగా నిర్మాణం పూర్తయిన నేటికి ముంపు గ్రామాలకు, నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వము 90 శాతం ప్రాజెక్టును పూర్తి చేసిన ఈ ప్రభుత్వము మిగిలిన 10 శాతానికి డబ్బులు కేటాయించక పోవడం చాలా దారణమని అన్నారు.
అధికారం చేపట్టిన వెంటనే ప్రాజెక్టును చేస్తామని చెప్పిన స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలని అన్నారు. ముంపు గ్రామాలైన లప్పనాయక్ తండ, చౌక్ల తండాకు కేటాయించిన పాట్లను (ఇంటి స్థలాలను) ఆలేరు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. బస్వాపురం ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని 10 మండలాల్లో వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని, మూసీ విష జలాలతో రైతాంగాన్నికి విముక్తి కలుగుతుందని, వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కోసం తక్షణం స్పందించాలని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన, పోరాటాలు నిర్వహించి నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని నర్సింహ హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య , మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కృష్ణ , కొండ అశోక్ , కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య , పాండాల మైసయ్య , మోటె ఎల్లయ్య , కొండపురం యాదగిరి , కళ్లెం లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.



