Thursday, April 9, 2026
E-PAPER
Homeజాతీయంపాలక్కడ్‌లో ఓటుకు రూ.5000

పాలక్కడ్‌లో ఓటుకు రూ.5000

- Advertisement -

ఓటర్లను ప్రభావితం చేస్తూ పట్టుబడిన బీజేపీ నేతలు
యూపీ నుంచి కేరళంలో దిగిన కార్లు.. వీడియో వైరల్‌
డబ్బుల పంపిణీ జరుగుతోంది : సీపీఐ(ఎం)
వాహనాలు తనిఖీ చేయాలని డిమాండ్‌

పాలక్కడ్‌ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళంలో నేడు పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు నగదు పంపిణీకి పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పాలక్కడ్‌ నియోజకవర్గంలో నగదు పంపిణీ ద్వారా ఓటర్లను ఆకర్శించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌ నాయకత్వంలో కన్నడి పంచాయతీలోని తరువక్కురిస్సిలో జరిగినట్టు సమాచారం. పంచాయతీలోని 16వ వార్డులో నివసిస్తున్న ఓ ఓటరుకు రూ.5,000 అందినట్టు తెలుస్తోంది. శోభా సురేంద్రన్‌తో పాటు వచ్చిన ఓ యువతి, ఓ వృద్ధురాలికి ఆమె ఇంటి వద్ద డబ్బును అందజేసింది. అనంతరం ఆ మహిళ హడావిడిగా కారు వద్దకు తిరిగి వెళ్తున్న దృశం వీడియోలో వైరల్‌ అవుతోంది.

అయితే వృద్ధురాలికి డబ్బులు ఇవ్వడం, సమీపంలో నిలిపి ఉంచిన మరో వాహనంలోని వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీయడం గమనించిన శోభా సురేంద్రన్‌ తన కారులోంచి దిగి, వీడియో తీస్తున్న వారిని నిలదీయడమే కాక వారి ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినట్టు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, ఆ మహిళ శారీరకంగా హింసిస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఆమె ఇంకా స్పందించలేదు. ఆ సమయంలో సురేంద్రన్‌తో పాటు బీజేపీ నాయకురాలు ప్రమీలా ససీధరన్‌ కూడా ఉన్నట్టు సమాచారం. ఫిర్యాదుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌ నుంచి నివేదిక కోరింది.

ఓటర్లను ఆకర్శించేందుకు పెద్ద మొత్తంలో నగదు తరలింపు : సీపీఐ(ఎం)
ఓటర్లను ప్రభావితం చేసేందుకు నియోజకవర్గంలో పెద్దమొత్తంలో నగదు పంపిణీ జరుగుతోందని సీపీఐ(ఎం) మరోసారి పునరుద్ఘాటించింది. ఉత్తరప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న అనేక వాహనాలు పాలక్కడ్‌కు వస్తున్నాయని పార్టీ నాయకుడు ఎన్‌.ఎన్‌. కృష్ణదాస్‌ ఆరోపించారు. ఈ విషయం తీవ్రమైనదని, ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అదే వార్డులో గతంలోనూ నగదు పంపిణీకి సంబంధించి ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని పేర్కొంటూ, బీజేపీ అభ్యర్థికి సంబంధించిన వాహనాలను తక్షణమే తనిఖీ చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -