దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల వెల్లువ
ఐటీ రంగంలో ఏఐ గుబులు
సెన్సెక్స్ 1,140 పాయింట్లు పతనం
ముంబయి : దలాల్ స్ట్రీట్‌ను అమ్మకాల సునామీ ముంచెత్తింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సానుకూల అంశాలు కానరాకపోవడానికి తోడుగా ఐటీ కంపెనీల్లో ఏఐ గుబులుతో ఆ రంగం షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని చవి చూశాయి. వారాంతం సెషన్‌లో ఒక్క పూటలో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలకు తోడు, దేశీయంగా ఐటీ, లోహ రంగాల్లో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు సూచీలను అగాధంలోకి నెట్టేశాయి.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీఎస్‌ఇ సెన్సెక్స్ 1,140 పాయింట్లు పతనమై 82,534.55కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 362.9 పాయింట్ల నష్టంతో 25,444 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో కేవలం మూడు స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ ఏకంగా 5 శాతం పతనమయ్యింది. టీసీఎస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, హెచ్‌యూఎల్ షేర్లు 6 శాతం వరకు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ దాదాపు రూ.7 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.472 లక్షల కోట్ల నుంచి రూ.465 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.
పతనానికి ప్రధాన కారణాలు..
అమెరికాలో నిరుద్యోగ రేటు తగ్గడం వల్ల అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత జాప్యం చేస్తుందనే భయాలు మార్కెట్‌ను వణికించాయి. దీనివల్ల భారత ఐటీ కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐటీ రంగాన్ని కృత్రిమ మేధ భయాలు వెంటాడుతున్నాయి. ఏఐ వల్ల భారత ఐటీ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనా దెబ్బతింటుందని, ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి.
సహజ వనరుల అవసరం తగ్గిపోవడం వల్ల కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరుగుతుందనే ప్రతికూల సంకేతాలు ఐటి షేర్లను భారీగా పడేశాయి. అమెరికాలోని టెక్ దిగ్గజాలైన ఆపిల్, మెటా, ఎన్విడియా వంటి సంస్థల షేర్లు పతనం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా దాదాపు అన్ని ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల బాటలో పయనించి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీశాయి. మున్ముందు కూడా మార్కెట్ మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయని.. రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



